Share News

పరమశివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను: పవన్ కళ్యాణ్

ABN , Publish Date - Feb 15 , 2026 | 02:41 PM

ధర్మ పరిరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆలయాల అభివృద్ధికి, ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆ పరమశివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

పరమశివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను: పవన్ కళ్యాణ్
Pawan Kalyan Extends Maha Shivaratri Wishes

అమరావతి, ఫిబ్రవరి 15: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరమేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా ఒక సందేశాన్ని విడుదల చేశారు.

క్షేత్రాల పవిత్రతకు పెద్దపీట

ఆంధ్రప్రదేశ్ పుణ్యభూమి అని కొనియాడిన పవన్ కళ్యాణ్.. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం, పంచారామ క్షేత్రాల విశిష్టతను గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆలయాల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 41 ప్రముఖ శైవ క్షేత్రాల్లో ప్రభుత్వం అధికారికంగా శివరాత్రి వేడుకలను నిర్వహిస్తోందని, ఇది తమ ప్రభుత్వ భక్తి భావానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 'శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గంలో నూతన సిమెంటు రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాం. కోటప్పకొండ భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణ మార్గం రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశాం.' అని పవన్ తెలిపారు.


ఆలయాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు

ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని చిన్న, పెద్ద ఆలయాలన్నింటికీ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.

'ఆలయాల అభివృద్ధికి, ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆ పరమశివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ భక్తులందరికీ.. పవన్ కళ్యాణ్ మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్

ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం: మంత్రి లోకేశ్

Updated Date - Feb 15 , 2026 | 03:29 PM