Share News

హ్యారీ బ్రూక్‌పై ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్లు!

ABN , Publish Date - Jul 01 , 2026 | 08:43 PM

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ బాధ్యతలు చేపట్టనున్నాడన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఐస్‌లాండ్ క్రికెట్ సోషల్ మీడియా వేదికగా హ్యారీ బ్రూక్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది.

హ్యారీ బ్రూక్‌పై ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్లు!
Harry Brook

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఇంగ్లండ్ టీ20, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్న హ్యారీ బ్రూక్.. టెస్టు ఫార్మాట్‌ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు బ్రూక్ టెస్టు కెప్టెన్సీపై స్పందించాడు. ఆ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో ఐస్‌లాండ్ క్రికెట్ సోషల్ మీడియా వేదికగా హ్యారీ బ్రూక్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది.


‘హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్‌కు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అంటే దానర్థం.. నైట్‌క్లబ్‌లు, బీచ్‌లు, పోలీస్ స్టేషన్లకు కూడా అతడు నాయకత్వం వహించాల్సిందే!’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌ నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తింది. ‘మన మనసులోని మాట ఐస్‌లాండ్ క్రికెట్ బయటపెట్టింది’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.


గతేడాది యాషెస్ సిరీస్ నుంచి ఇంగ్లండ్ ప్లేయర్లు వరుస వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో టెస్టె సిరీస్ అనంతరం ఫూటుగా మద్యం తాగిన వీడియోలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆ ఘటన తర్వాత ఇంగ్లండ్ ప్లేయర్లపై బోర్డు నైట్ కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ దాన్ని ఉల్లంఘిస్తూ న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అనంతరం బెన్ స్టోక్స్, అట్కిన్సన్ నైట్‌క్లబ్‌కు వెళ్లి అక్కడ ఓ రగ్బీ ఆటగాడితో ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వివాదాల నడుమ ఐస్‌లాండ్ క్రికెట్ పెట్టిన ఈ ఫన్నీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

Updated Date - Jul 01 , 2026 | 08:43 PM