వైభవ్‌ది స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాల్సిన వయసు: సౌతాఫ్రికా క్రికెటర్
ABN , Publish Date - Jul 01 , 2026 | 07:04 PM
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌పై అందరూ పెట్టుకున్న అంచనాల వల్ల అతడు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. 15 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టులో అవకాశం దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. అయితే పసికూన ఐర్లాండ్‌పై భారత్ చిత్తు అయిన సంగతి తెలిసిందే. దీంతో వైభవ్‌ను ఆడించాల్సిందంటూ చర్చ మొదలైంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌పై అందరూ పెట్టుకున్న అంచనాల వల్ల అతడు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని తెలిపాడు.
‘సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిప్రాయాల మధ్య పెరుగుతున్న ఒత్తిడిని 15 ఏళ్ల కుర్రాడు మోయాల్సి వస్తోంది. వైభవ్ కెరీర్‌పై నాకు ఆందోళనగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం.. అతడు ఇప్పుడు ఇంట్లో ఉండి స్కూల్, పరీక్షలకు సిద్ధమవ్వాలి. స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాలి. కానీ వైభవ్ విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఒక సాధారణ బాలుడిలాగా అతడు ఎదగడానికి అవకాశం ఇవ్వాలి. అతడి ప్రతిభను నిర్లక్ష్యం చేయమని నా ఉద్దేశం కాదు.. కానీ మానసికంగా, శారీరకంగా సంపూర్ణంగా ఎదిగేలా చూడాలి. ఇలాంటి ప్రతిభ ఉన్న వైభవ్ కెరీర్ 25 ఏళ్లకే ముగిసిపోకూడదు. 40 ఏళ్ల వరకు కొనసాగించేలా తీర్చిదిద్దాలి. అతడి జీవితం పూర్తిగా క్రికెట్ చుట్టే కాకుండా.. సాధారణ జీవితాన్ని కూడా ఆస్వాదించేలా ఉండాలి. ఈ మూడేళ్లు అతడికి అత్యంత ముఖ్యం. ఈ సమయంలో వైభవ్‌కు సరైన మార్గనిర్దేశం అవసరం. ఈ క్రమంలో వైభవ్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలిస్తే మంచిది. సచిన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒత్తిడి గురించి చెప్పి.. వైభవ్‌కు సరైన దారి చూపగలడు’ అని కలినన్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!
శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్