ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకింగ్స్.. మూడో స్థానానికి ఎగబాకిన భారత్
ABN , Publish Date - May 01 , 2026 | 08:24 PM
ఐసీసీ తాజా వార్షిక టెస్టు ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. దీంట్లో ఆస్ట్రేలియా మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 131 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ తాజా వార్షిక టెస్టు ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. దీంట్లో ఆస్ట్రేలియా మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 131 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొట్టిన టీమిండియా.. గతేడాది నుంచి టెస్టుల్లో కాస్త ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. స్వదేశంలోనూ ఓటములను చవి చూసింది. అయితే ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియాకు మెరుగైన ఫలితాలు రావడం గమనార్హం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్‌తో టెస్టులను ఆడనుంది. అన్నింట్లోనూ విజయాలు సాధించి.. మిగతా జట్లు వెనకబడితేనే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు అవకాశం ఉంది.
ఈ ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 131 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానాన్ని సౌతాఫ్రికా(119) నిలబెట్టుకుంది. ఇక భారత్(104) కూడా ఒక ప్లేస్‌ను మెరుగుపర్చుకుని మూడో స్థానానికి వచ్చింది. బజ్‌బాల్ క్రికెట్ అంటూ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తోన్న ఇంగ్లండ్(102) నాలుగో స్తానానికి పడిపోయింది. న్యూజిలాడ్(101) ఐదో స్థానంలో ఉండగా, ఆ తర్వాత పాకిస్థాన్(89), శ్రీలంక(86), వెస్టిండీస్(68), బంగ్లాదేశ్(67), ఐర్లాండ్(25), జింబాబ్వే(10) కొనసాగుతున్నాయి. మొత్తం 12 జట్లలో అఫ్గానిస్థాన్‌కు మాత్రమే ఒక్క పాయింట్ కూడా రాకపోవడం గమనార్హం.
మహిళల విభాగంలో..
ఇదే సమయంలో మహిళా క్రికెట్ విభాగంలో వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ విడుదల చేసింది. ఇందులోనూ ఆస్ట్రేలియా క్రికెట్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 163 పాయింట్లతో ఆసీస్ అగ్రస్థానంలో ఉంది. కాగా రెండో స్థానంలో ఇంగ్లండ్ మహిళా క్రికెట్ టీమ్(128) నిలిచింది. 126 పాయింట్లతో టీమిండియా మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తమ స్థానాలను పదిల పర్చుకున్నాయి. బంగ్లాదేశ్ 73 పాయింట్లతో పాకిస్థాన్‌ను దాటి ఏడో స్థానానికి ఎగబాకింది. థాయ్‌లాండ్, నెదర్లాండ్స్ జట్లు అవసరమైన మ్యాచ్‌లు ఆడకపోవడంతో ర్యాంకింగ్స్ నుంచి తాత్కాలికంగా తప్పుకున్నాయి. ఇదిలా ఉండగా, మే 5న టీ20 ర్యాంకింగ్స్, మే 7న వన్డే పురుషుల ర్యాంకింగ్స్ ప్రకటించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
శతక సిక్సర్ల జాబితాలోకి.. కీలక మైలురాయికి అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
అంపైర్లు మరింత నిశితంగా గమనించాల్సింది.. క్యాచ్ ఔట్ వివాదంపై భువీ రియాక్షన్