Share News

శివం మావి స్థానంలో ఆర్ఎస్ అంబరీష్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రకటన

ABN , Publish Date - May 01 , 2026 | 06:15 PM

ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఆ జట్టు ప్లేయర్ శివం మావి టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆర్ఎస్ అంబరీష్‌ను తీసుకుంది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది.

శివం మావి స్థానంలో ఆర్ఎస్ అంబరీష్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రకటన
RS Ambarish

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో అదరగొడుతోంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి రెట్టింపు ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఆ జట్టు ప్లేయర్ శివం మావి టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆర్ఎస్ అంబరీష్‌ను తీసుకుంది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది.


గతేడాది ఐపీఎల్ వేలంలో శివం మావిని రూ.75 లక్షలకు ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఇప్పుడు తొడ కండరాల గాయంతో శివం మావి టోర్నీ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో అండర్ 19 ప్రపంచ కప్ 2026 గెలిచిన భారత జట్టు సభ్యుడు అంబరీష్‌ను జట్టులోకి తీసుకుంది. మీడియం పేసర్, ఎడమచేతి బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శనలు చేస్తోన్న అంబరీష్‌తో ఫ్రాంచైజీ రూ.30లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్‌ 2026లో అంబరీష్ అద్భుత ప్రదర్శనలు చేశాడు. టీమిండియా కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో 11 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ కీలకంగా రాణించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంబరీష్ రాకతో ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ దళం మరింత మెరుగుపడనుంది.


ఇదిలా ఉండగా, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. అటు బ్యాటింగ్‌లో బీభత్సం సృష్టిస్తుండగా, ఇప్పుడు బౌలింగ్ దళం కూడా అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. ఆడిన 9 మ్యాచుల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా ఆదివారం ఉప్పల్ వేదికగా కేకేఆర్‌తో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

శతక సిక్సర్ల జాబితాలోకి.. కీలక మైలురాయికి అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ

అంపైర్లు మరింత నిశితంగా గమనించాల్సింది.. క్యాచ్ ఔట్ వివాదంపై భువీ రియాక్షన్

Updated Date - May 01 , 2026 | 06:16 PM