Share News

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ

ABN , Publish Date - Jan 21 , 2026 | 08:10 PM

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్‌ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్‌ మ్యాచ్‌ల వేదికలను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బీసీబీ అభ్యర్థనను తిరస్కరించింది.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ
T20 World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్‌ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్‌ మ్యాచ్‌ల వేదికలను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బీసీబీ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో పునఃపరిశీలనలు ఉండవని తేల్చి చెప్పింది.


ఇవాళ (బుధవారం) ఐసీసీ అత్యవసర బోర్డు సమావేశం జరిగింది. బీసీబీ ప్రతిపాదనపై ఓటింగ్‌ ద్వారా ఐసీసీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 12 మంది సభ్యుల్లో కేవలం ఇద్దరు మాత్రమే బంగ్లాదేశ్ అభ్యర్థనకు మద్దతు ఇచ్చారు. మిగతా సభ్యులు వ్యతిరేకించారు. బీసీబీ తమ తుది నిర్ణయాన్ని 24 గంటల్లో చెప్పాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. భారత్‌కు వెళ్లకూడదనే తమ వైఖరికి బంగ్లాదేశ్ కట్టుబడి ఉంటే.. వారి స్థానంలో స్కాట్లాండ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్కాట్లాండ్ టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది. ప్రపంచకప్‌కు అర్హత సాధించని జట్లలో టాప్ ర్యాంక్ కలిగిన జట్టుగా స్కాట్లాండ్‌ ఈ టోర్నీకి ఎంపికవుతుంది.


భారత్‌లో ఆడకుండా ఉండటానికి బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు చెబుతున్న కారణాలు, అలానే ముస్తాఫిజుర్ రహ్మాన్ ఉదంతంతో సంబంధమే లేదని ఐసీసీ స్పష్టం చేసింది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించడాన్ని భద్రతా సమస్యతో అనుసంధానం చేయడం సరి కాదని ఐసీసీ హితవు పలికింది.


తమ ఆటగాళ్లకు భద్రత లేదని కారణంగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లా జట్టుకు ఐసీసీ పూర్తి భరోసా ఇచ్చింది. అయినప్పటికీ బీసీబీ మాత్రం తన డిమాండ్ ను వెనక్కి తీసుకోవడం లేదు. తాజాగా జరిగిన సమావేశంలో స్వతంత్ర సంస్థలు చేసిన భద్రతా అంచనాలు, వేదికల వారీగా రూపొందించిన భద్రతా ప్రణాళికలు, ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంక ఇచ్చిన హామీలన్నిటినీ ఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ తర్వాతనే బంగ్లాదేశ్‌ జట్టుకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.


టీ20 ప్రపంచ కప్-2026 షెడ్యూల్‌ ప్రకారం బంగ్లాదేశ్‌ గ్రూప్-సీలో ఉంది. బంగ్లాతో పాటు వెస్టిండీస్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ జట్లు గ్రూప్‌-సి లో ఉన్నాయి. బంగ్లాదేశ్ తొలి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడి, చివరి గ్రూప్ మ్యాచ్‌ను ముంబైలో ఆడాల్సి ఉంది. మొత్తంగా తమ డిమాండ్ ను ఐసీసీ తిరస్కరించడంతో బీసీబీ ఏం చేస్తుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి:

భవిష్యత్తులో గిల్ టీ20 కెప్టెన్ అవుతాడు.. ఆసీస్ మాజీ కెప్టెన్

లిజెలీ లీకి షాక్.. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై చర్యలు

Updated Date - Jan 21 , 2026 | 09:06 PM