Share News

పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఐసీసీ.. ఏకంగా 11 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత

ABN , Publish Date - Sep 14 , 2026 | 02:45 PM

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్థాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది.

పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఐసీసీ.. ఏకంగా 11 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత
Pakistan, ICC

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్థాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన చివరి టెస్టులో నిర్దేశిత సమయంలో 11 ఓవర్లు తక్కువగా వేసినందుకు పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఖాతా నుంచి ఏకంగా 11 పాయింట్లు తగ్గించింది.


సమయ మినహాయింపులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా పాకిస్థాన్ 11 ఓవర్లు తక్కువగా వేసినట్లు ఐసీసీ తేల్చింది. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ జరిమానా విధించారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో వేయాల్సిన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం చొప్పున జరిమానా విధిస్తారు. గరిష్ఠంగా 50 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పాకిస్థాన్ విషయంలో 11 ఓవర్ల లోటు ఉండటంతో గరిష్ఠ జరిమానా అమలైంది. కాగా నిర్దేశిత సమయానికి తక్కువగా వేసిన ప్రతి ఓవర్‌కు ఒక పాయింట్ చొప్పున పాకిస్థాన్ ఖాతా నుంచి 11 పాయింట్లు తగ్గించారు. దీంతో ఇప్పటికే డబ్ల్యూటీసీ పట్టికలో అట్టడుగున ఉన్న పాకిస్థాన్ పరిస్థితి మరింత దిగజారింది.


వరుస పరాజయాలతో పాకిస్థాన్ డబ్ల్యూటీసీ పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ జట్టు తొమ్మిది టెస్టులు ఆడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. మరో ఏడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాకిస్థాన్ పాయింట్ల శాతం 4.63గా ఉంది. డబ్ల్యూటీసీలో పాకిస్థాన్ తదుపరి శ్రీలంకతో తలపడనుంది. నవంబర్‌లో రెండు టెస్టుల సిరీస్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. రావల్పిండి, లాహోర్ వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. డబ్ల్యూటీసీ పట్టికలో తమ పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే ఈ సిరీస్‌లో పాకిస్థాన్ తప్పక రాణించాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

అభి‘షేక్‌’ చేశాడు!

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని ముందే చెప్పాం: బీసీసీఐ సెక్రటరీ

Updated Date - Sep 14 , 2026 | 03:01 PM