Share News

అభి‘షేక్‌’ చేశాడు!

ABN , Publish Date - Sep 14 , 2026 | 04:03 AM

డాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అదరగొట్టాడు. షేర్‌ ఎ పంజాబ్‌ లీగ్‌లో చూపిన ఫామ్‌ను అఫ్ఘాన్‌పైనా ప్రదర్శించాడు. పేస్‌, స్పిన్‌ తేడా లేకుండా బాదుడే లక్ష్యంగా సాగిన అతడి...

అభి‘షేక్‌’ చేశాడు!

తొలి టీ20 భారత్‌దే

  • 7 వికెట్లతో అఫ్ఘాన్‌ చిత్తు

డాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అదరగొట్టాడు. షేర్‌ ఎ పంజాబ్‌ లీగ్‌లో చూపిన ఫామ్‌ను అఫ్ఘాన్‌పైనా ప్రదర్శించాడు. పేస్‌, స్పిన్‌ తేడా లేకుండా బాదుడే లక్ష్యంగా సాగిన అతడి ఇన్నింగ్స్‌తో టీ20 సిరీ్‌సలో భారత్‌ ఘనంగా బోణీ చేసింది. అంతకుముందు బౌలర్లు కూడా రాణించడంతో జద్రాన్‌ బృందం ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఒమర్జాయ్‌, నబీ కాస్త పోరాడారు.

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీ్‌సలో భారత్‌ శుభారంభం చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 82) ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా సిరీ్‌సలో 1-0 ఆధిక్యం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 నాటౌట్‌), మహ్మద్‌ నబీ (27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33) మాత్రమే రాణించారు. అర్ష్‌దీప్‌ సింగ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్‌ 13.4 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఇషాన్‌ కిషన్‌ (33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 42) ఆకట్టుకున్నాడు. నబీ రెండు వికెట్లు తీశాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా అభిషేక్‌ నిలిచాడు.

బాదుడే లక్ష్యంగా..: ఓ మాదిరి ఛేదనను భారత్‌ వాయువేగంతో ఆరంభించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (10) మూడో ఓవర్‌లోనే వెనుదిరిగినా.. అభిషేక్‌ చెలరేగాడు. ఇషాన్‌ క్రీజులో ఉన్నప్పటికీ తానే ఎక్కువగా స్ట్రయికింగ్‌ తీసుకుని ఎదురుదాడికి దిగాడు. బౌండరీల జోరుతో పరుగుల వరద పారించాడు. అతడి ధాటికి పవర్‌ప్లేలో జట్టు 82/1తో నిలిచింది. 22 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్‌ స్పిన్నర్లు రషీద్‌, నూర్‌లను లక్ష్యంగా చేసుకున్నాడు. అయితే అభిషేక్‌ సెంచరీ ఖాయమనిపించిన వేళ 11వ ఓవర్‌లో నబీ చేతిలో అవుటయ్యాడు. రెండో వికెట్‌కు ఇషాన్‌తో అభిషేక్‌ 121 పరుగులు జోడించడం విశేషం. ఇక విజయానికి 5 పరుగుల దూరంలో ఇషాన్‌ అవుట్‌ కాగా.. కెప్టెన్‌ శ్రేయాస్‌ (8 నాటౌట్‌), తిలక్‌ (3 నాటౌట్‌) మరో 38 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించారు.


ఒమర్జాయ్‌ పోరాటం..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ ఇన్నింగ్స్‌లో ఒమర్జాయ్‌ ఎదురుదాడి కీలకంగా నిలిచింది. అతడికి వెటరన్‌ నబీ సహకరించడంతో జట్టు అద్భుతంగా పుంజుకుంది. అలాగే ఐదో బౌలర్‌ను లక్ష్యంగా చేసుకున్న అఫ్ఘాన్‌ ఏకంగా 4 ఓవర్లలోనే 59 పరుగులు సాధించింది. అయితే ఆరంభ ఓవర్‌లోనే పేసర్‌ బుమ్రా ఓపెనర్‌ గుర్బాజ్‌ను డకౌట్‌ చేయగా.. అర్ష్‌దీప్‌, అక్షర్‌, వరుణ్‌ల ధాటికి తొలి ఏడు ఓవర్లలోనే టాప్‌-5 ఆటగాళ్లు పెవిలియన్‌ చేరారు. అప్పటికి అఫ్ఘాన్‌ స్కోరు 43 మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఒమర్జాయ్‌-నబీ దీటుగా క్రీజులో నిలిచారు. నితీశ్‌ వేసింది రెండు ఓవర్లే అయినా ఒమర్జాయ్‌ బాదుడుకు 30 పరుగులిచ్చుకున్నాడు. చివరకు 17వ ఓవర్‌లో నబీని అర్ష్‌దీప్‌ అవుట్‌ చేయడంతో ఆరో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మళ్లీ చకచకా వికెట్లు కోల్పోయినా ఒమర్జాయ్‌ మాత్రం 39 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. ఇక దూబే వేసిన చివరి ఓవర్‌లో ఒమర్జాయ్‌ 6,6 ముజీబుర్‌ 4,4తో ఏకంగా 21 పరుగులు రాబట్టి ఇన్నింగ్స్‌ను ముగించారు.

స్కోరుబోర్డు

అఫ్ఘానిస్థాన్‌: గుర్బాజ్‌ (సి) అభిషేక్‌ (బి) బుమ్రా 0, జద్రాన్‌ (రనౌట్‌) 11, సెదికుల్లా (సి) బుమ్రా (బి) అర్ష్‌దీప్‌ 13, గుల్బదిన్‌ (సి) నితీశ్‌ (బి) అక్షర్‌ 2, రసూలి (బి) వరుణ్‌ 2, ఒమర్జాయ్‌ (నాటౌట్‌) 64, నబీ (బి) అర్ష్‌దీప్‌ 33, రషీద్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్‌దీప్‌ 1, నూర్‌ అహ్మద్‌ (రనౌట్‌) 0, ముజీబుర్‌ (నాటౌట్‌) 9, ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: 20 ఓవర్లలో 156/8; వికెట్ల పతనం: 1-5, 2-38, 3-39, 4-41, 5-43, 6-126, 7-131, 8-131; బౌలింగ్‌: బుమ్రా 4-0-26-1, అర్ష్‌దీప్‌ 4-0-19-3, అక్షర్‌ 4-0-27-1, వరుణ్‌ 4-0-16-1, నితీశ్‌ 2-0-30-0, అభిషేక్‌ 1-0-8-0, దూబే 1-0-21-0.

భారత్‌: శాంసన్‌ (సి) రసూలి (బి) అజ్మతుల్లా 10, అభిషేక్‌ (సి) రషీద్‌ (బి) నబీ 82, ఇషాన్‌ (సి) రషీద్‌ (బి) నబీ 42, శ్రేయాస్‌ (నాటౌట్‌) 8, తిలక్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: 13.4 ఓవర్లలో 157/3. వికెట్ల పతనం: 1-18, 2-139, 3-152. బౌలింగ్‌: ఫరూఖి 2-0-38-0, ముజీబుర్‌ 2-0-16-0, ఒమర్జాయ్‌ 1-0-14-1, నబీ 3-0-28-2, రషీద్‌ 3.4-0-34-0, నూర్‌ 2-0-25-0.


2

అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువసార్లు డకౌట్‌ (11) అయిన ఓపెనర్‌గా రహ్మనుల్లా గుర్బాజ్‌. పాల్‌ స్టిర్లింగ్‌ (14) టాప్‌లో ఉన్నాడు.

2

టీ20 ఫార్మాట్‌లో వేగంగా (3420 బంతుల్లో) 6000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా అభిషేక్‌. ఆలెన్‌ (3386) ముందున్నాడు.

తొలిసారి వందేమాతరం..

భారత క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారిగా ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. అఫ్ఘానిస్థాన్‌తో టీ20 మ్యాచ్‌ ఆరంభానికి ముందు స్టేడియంలో భారత జాతీయ గేయమైన వందేమాతరాన్ని ఆలపించడం విశేషం. మొత్తం ఆరు చరణాలు ఉండే ఈ గేయం ముగిసేందుకు 3 నిమిషాల 10 సెకన్లు పట్టింది. ఆ వెంటనే జాతీయ గీతమైన జనగణమనను కూడా పాడించారు. కేంద్ర హోం శాఖ జారీ చేసిన గైడ్‌లైన్స్‌ ప్రకారం.. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతానికి ముందే తప్పనిసరిగా జాతీయ గేయమైన వందేమాతరాన్ని కూడా ఆలపించాలన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్: వరుసగా నాలుగోసారి.. విజేతగా భారత్‌

ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం

Updated Date - Sep 14 , 2026 | 04:03 AM