నెట్స్‌లో అర్ధరాత్రి ప్రాక్టీస్ చేసిన హార్దిక్ పాండ్య.. వీడియో వైరల్
ABN , Publish Date - May 13 , 2026 | 10:43 AM
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. వరుస ఓటములతో ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్య ఇన్ స్టా స్టోరీ తీవ్ర చర్చనీయాంశం అయింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. వరుస ఓటములతో ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. అనూహ్యంగా గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు పాండ్య దూరంగా ఉన్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ ఎంఐకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్య ఇన్ స్టా స్టోరీ తీవ్ర చర్చనీయాంశం అయింది.
వెన్ను నొప్పి కారణంగా గత రెండు మ్యాచ్‌లు హార్దిక్ పాండ్య ఆడలేకపోయాడని కోచ్ మహేల జయవర్ధనె వెల్లడించిన సంగతి తెలిసిందే. గురువారం పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు పాండ్య అందుబాటులో ఉంటాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నెట్స్‌లో అర్ధరాత్రి ఒంటరిగా హార్దిక్ పాండ్య ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు. దీంతో అతడు మళ్లీ జట్టులోకి తిరిగి రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే కెప్టెన్సీ పరంగా, బ్యాటింగ్ పరంగానూ హార్దిక్ పాండ్యపై తీవ్ర ఒత్తిడి పడిన సంగతి తెలిసిందే. వ్యూహాత్మక నిర్ణయ తప్పిదాల వల్ల జట్టు ఓటమి పాలవుతుందంటూ మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు విమర్శించారు. అతడి వ్యక్తిగత ప్రదర్శన పట్ల ఫ్రాంచైజీ ఓనర్ నీతా అంబాని కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా జట్టు నుంచి పాండ్య దూరం కావడం.. తాజాగా ప్రాక్టీస్ వీడియోలు వైరల్ అవ్వడంతో అతడు నిజంగానే గాయపడ్డాడా? లేక కావాలనే తప్పించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలి: గావస్కర్
ఇక ముంబై ఇండియన్స్ మిగిలిన మూడు మ్యాచుల్లో యువ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ సూచించాడు. ‘టీ20 క్రికెట్‌లో ఎత్తుపల్లాలు సహజం. సీజన్ ముగిసిన తర్వాత జరిగిన పొరపాట్లను విశ్లేషించుకోవచ్చు. ఇప్పటికైతే ఎంఐ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. సీనియర్లు తమ వంతు కృషి చేశారు. ఇక యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తే ఒత్తిడి ఎలా ఎదుర్కొంటారో ఫ్రాంచైజీకి అర్థమవుతోంది’ అని ఓ కార్యక్రమంలో పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్ చిత్తు.. గెలుపు రహస్యాన్ని చెప్పేసిన గుజరాత్ కెప్టెన్ గిల్
ఐపీఎల్ 2026: సాయి సుదర్శన్ అరుదైన రికార్డు