ట్రోఫీ గెలిచి తీరుతాం.. మాకు మద్దతుగా నిలవండి: పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్
ABN , Publish Date - May 13 , 2026 | 09:23 AM
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో అదిరే ఆటతో అందరి దృష్టిని తనవైపే తిప్పుకున్న పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు అనూహ్యంగా దెబ్బతింటోంది. వరుస ఓటముల నేపథ్యంలో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశాడు. తాము ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నామని.. తమకు మద్దతు ఇవ్వాలంటూ అభిమానులను కోరాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో అదిరే ఆటతో అందరి దృష్టిని తనవైపే తిప్పుకున్న పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు అనూహ్యంగా దెబ్బతింటోంది. వరుస విజయాలతో అందరికన్నా ముందు అలవోకగా ప్లే ఆఫ్స్ చేరేలా కనిపించిన పంజాబ్.. ఇప్పుడు వరుస ఓటములతో టోర్నీలో ముందంజ వేసేందుకు పోరాడాల్సిన స్థితికి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 211 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక పంజాబ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. వరుస ఓటముల నేపథ్యంలో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశాడు. తాము ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నామని.. తమకు మద్దతు ఇవ్వాలంటూ అభిమానులను కోరాడు. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
‘మేము వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయాం. కానీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాం. తప్పకుండా ప్లే ఆఫ్స్ చేరి ఈ సీజన్ ట్రోఫీ గెలుస్తాం. ఇలాంటి సమయంలో అభిమానుల మద్దతు మాకు చాలా అవసరం. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి కమ్‌బ్యాక్ ఇస్తాం. ధర్మశాలను రెడ్ కలర్‌తో నింపేయండి’ అని ప్రభ్‌సిమ్రన్ అభిమానులను కోరాడు. ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో ప్రభ్‌సిమ్రన్ 11 మ్యాచుల్లో 382 పరుగులు చేశాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌ల్లో ఆరింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఐదు, ఆరో స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పంజాబ్‌ను తీవ్రంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయి. పంజాబ్ తన తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో గురువారం తలపడనుంది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఓడితే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకునే ప్రమాదం లేకపోలేదు.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్ చిత్తు.. గెలుపు రహస్యాన్ని చెప్పేసిన గుజరాత్ కెప్టెన్ గిల్
ఐపీఎల్ 2026: సాయి సుదర్శన్ అరుదైన రికార్డు