Share News

అఫ్గాన్‌తో వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య!

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:04 PM

జూన్ 13 నుంచి అఫ్గాన్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త అందింది. గాయం బారిన పడిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్ సాధించాడు.

అఫ్గాన్‌తో వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య!
Hardik Pandya

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జూన్ 13 నుంచి అఫ్గాన్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త అందింది. గాయం బారిన పడిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసిన హార్దిక్‌కు.. మెడికల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ వెన్ను నొప్పి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. జూన్ 2 నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఐదు రోజుల పాటు పలు శిక్షణా సెషన్లలో పాల్గొన్నట్టు సమాచారం. అతడి పూర్తి కోటా 10 ఓవర్లు బౌలింగ్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. శిక్షణ సమయంలో ఎలాంటి అసౌకర్యం కనిపించలేదని, ఫిట్‌నెస్‌కు సంబంధించిన అన్ని ప్రమాణాల్లో హార్దిక్ సంతృప్తికర ఫలితాలు సాధించాడని సమాచారం. ముఖ్యంగా 10 ఓవర్ల పూర్తి స్పెల్ బౌలింగ్ చేయడం అతడు 50 ఓవర్ల క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నాడనే సంకేతంగా భావిస్తున్నారు. అయితే హార్దిక్ నేరుగా ధర్మశాలలో జరగనున్న తొలి వన్డేతో జట్టులో చేరతాడా? లేక చండీగఢ్‌లో జరిగే శిక్షణ శిబిరంలో పాల్గొంటాడా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.


ఇదిలా ఉంటే, తొడ కండరాల గాయం కారణంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. మరో బ్యాటర్ రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. ఐపీఎల్ సమయంలో గాయపడిన రోహిత్ గాయం పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

ట్రై సిరీస్: నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ

మద్యం మత్తులో ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. స్టోక్స్ కెప్టెన్సీకి ముప్పు?

Updated Date - Jun 09 , 2026 | 12:04 PM