ఇంగ్లండ్-భారత్ సెమీస్ పోరు రసవత్తరంగా ఉంటుంది: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:58 PM
పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇప్పటికే సూపర్ 8 నుంచి నాలుగు జట్లు సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్-భారత్ తలపడనున్నాయి. ఈ విషయంపై సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇప్పటికే సూపర్ 8 నుంచి నాలుగు జట్లు సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా-న్యూజిలాండ్, వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్-భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక పోరుపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కచ్చితంగా ఫైనల్ వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘భారత క్రికెట్‌లో ఇది కొత్త యుగం.. ఇప్పుడు ఆడేది కొత్త జట్టు. గత రికార్డులను మరిచిపోవాలి. వాంఖడేలో భారత్‌కు సెమీ ఫైనల్స్‌లో అంత గొప్ప రికార్డు లేదు. కానీ ఈ టోర్నీలో టీమిండియా చరిత్ర సృష్టిస్తుంది. సెమీస్‌లో గెలిచే సామర్థ్యం ప్రతి ఒక్క ప్లేయర్‌లోనూ కనిపిస్తుంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూడా చాలా బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, మిడిల్ ఆర్డర్, ఫినిషర్లు.. అన్నింటిలోనూ ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ సెమీస్ పోరు అత్యంత రసవత్తరంగా సాగనుంది’ అని సన్నీ వెల్లడించాడు.
టీమిండియాకు గావస్కర్ సలహా
సెమీ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాకు సన్నీ కీలక సూచనలు చేశాడు. ‘పవర్ ప్లేలో దూకుడుగా ఆడటం అవసరమే. కానీ ప్రతి బంతినీ బౌండరీ బాదాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు అనుగుణంగా గేర్ మార్చాలి. మొదట కాస్త క్రీజులో కుదుర్కొని ఆపై దూకుడు పెంచాలి. తమ బలాలను గుర్తించి ఆడాలి. ఎప్పుడూ అటాకింగ్ మోడ్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క చిన్న తప్పిదం కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తుంది’ అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: సెమీస్‌కు మ్యాచ్ రెఫరీలు వీరే!
కోహ్లీ ఎప్పటికీ ఆర్సీబీని వీడడు: మో బోబాట్