England Cricketers: క్యాసినోలో క్రికెటర్లు.. ప్రదర్శన కంటే వివాదాలకే ప్రాధాన్యత!
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:35 PM
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై 4-1 తేడాతో ఇంగ్లండ్ ఘోర పరాభవం చవి చూసిన విషయం తెలిసిందే. ఈ ఓటమి కంటే కూడా జట్టు క్రమశిక్షణ, ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన వార్తలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాలుగో టెస్టుకు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లు మద్యం మత్తులో ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై 4-1 తేడాతో ఇంగ్లండ్ ఘోర పరాభవం చవి చూసిన విషయం తెలిసిందే. ఈ ఓటమి కంటే కూడా జట్టు క్రమశిక్షణ, ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన వార్తలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాలుగో టెస్టుకు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లు మద్యం మత్తులో ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ మెకల్లమ్ మధ్య కూడా తీవ్రస్థాయిలో విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఆస్ట్రేలియా పర్యటనలో ఇంగ్లండ్ జట్టు.. ప్రదర్శన కంటే వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు మైదానంలో కంటే క్యాసినో టేబుళ్ల వద్దే ఎక్కువ సమయం గడిపినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. తమ బజ్‌బాల్‌తో హడలెత్తించిన ఇంగ్లండ్.. ఈ పరిస్థితికి దిగజారడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
క్యాసినోలో మకాం!
ఇంగ్లండ్ జట్టు బస చేసిన హోటల్.. ఓ విలాసవంతమైన క్యాసినో కాంప్లెక్స్. ఆటగాళ్లు పదేపదే క్యాసినోకు వెళ్తూ, మద్యం తాగుతూ అభిమానుల కంటపడ్డారు. బాక్సింగ్ డే టెస్టుకు ముందు యువ ఆటగాడు జాకబ్ బెథెల్ వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కగా.. ఓపెనర్ డకెట్ మద్యం మత్తులో కనీసం టాక్సీ కూడా ఎక్కలేనంత స్థితిలో ఉన్న వీడియో వైరల్ అయ్యింది. కొందరు ఆటగాళ్లు వరుసగా ఆరు రోజుల పాటు మద్యం తాగినట్టు సమాచారం. ఇది వారి ఫిట్‌నెస్, ఆటపై తీవ్ర ప్రభావం చూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వీళ్లకి ఏమైందసలు..?
ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్ కోల్పోయింది. ఆటగాళ్లలో పెరిగిన మద్యం అలవాట్లు, జూదం, మేనేజ్‌మెంట్ మధ్య సమన్వయ లోపం వల్ల ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వరుస ఓటములను చవి చూస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ భవిష్యత్తుపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ వైఫల్యం తర్వాత హెడ్ కోచ్ మెకల్లమ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందన్న వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
షాకింగ్.. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్
జిమ్‌లో కష్టపడటం కంటే.. ఇంట్లో విశ్రాంతి తీసుకోవడమే మేలు: పీవీ సింధు