ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది: జహీర్ ఖాన్
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:15 PM
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతడి నిర్ణయంపై సీఎస్కే హెడ్ కోచ్ జహీర్ ఖాన్ స్పందించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ శకం ముగిసింది. ఇటీవలే క్రికెటర్‌గా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు సార్లు టైటిల్స్ గెలవడంలో ధోని కీలక పాత్ర పోషించాడు. మరో సీజన్ లో కూడా ప్రేక్షకులను అలరిస్తాడని భావిస్తున్న తరుణంలో వీడ్కోలు చెబుతూ అందరినీ విస్మయానికి గురి చేశాడు. మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ధోని నిర్ణయంపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ జహీర్ ఖాన్ స్పందించాడు. ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపాడు.
సీఎస్కే యూట్యూబ్ ఛానల్‌లో జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్ 2027 సీజన్ ఈ సైకిల్‌లో చివరిది కావడంతో ధోనీ ఆట నుంచి తప్పుకుంటారని నేను ఊహించలేదు. నా మనసులో ఆ ఆలోచనే లేదు. కానీ ఎంఎస్.. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది కచ్చితంగా తెలుసుకుని నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి హంగామా లేకుండా చాలా సహజంగా, సున్నితంగా తన నిర్ణయాన్ని చెప్పారు’ అని జహీర్ పేర్కొన్నాడు.
‘ప్రతి ఏటా ధోని మైదానంలో ఆడుతూ కనిపిస్తారని ఆశిస్తాం. ఈసారి మాత్రం క్రికెటర్‌గా కాకుండా మెంటర్‌గా కొత్త అవతారంలో కనిపించనున్నారు. అందుకే ధోని నిర్ణయం విషయంలో నాకు మిశ్రమ భావోద్వేగాలు ఉన్నాయి. మెంటర్‌గా నా భారాన్ని పంచుకుంటూ, సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తారన్న ఆనందం ఒకవైపు.. అతడు తీసుకున్న నిర్ణయం పట్ల భావోద్వేగం మరోవైపు ఉన్నాయి. అలానే సీఎస్కే బాధ్యతల విషయంలో మా మధ్య హద్దులు లేవు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచి, వారికి స్వేచ్ఛనివ్వడమే ధోనీ నాయకత్వంలోని గొప్ప లక్షణం’ అని జహీర్ ఖాన్ ప్రశంసించాడు. కాగా, రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్కే రూ.28.05 కోట్ల పర్స్‌తో వేలానికి సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
వీళ్లు సచిన్‌ను కూడా పక్కన పెడతారు.. టీమిండియా మేనేజ్‌మెంట్‌పై కైఫ్ విమర్శలు..
రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలుకొట్టిన పడిక్కల్..