రెడ్ బాల్ క్రికెట్‌కు చాహల్ గుడ్‌బై.. ఫస్ట్ క్లాస్ ఆటకు స్వస్తి!
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:10 PM
టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. తనకు ఎంతో ఇష్టమైన టెస్టు జెర్సీ (Test Cap)ని ధరించే కల ఇక సాధ్యం కాదని గ్రహించిన చాహల్, రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే వన్డేలు, టీ20ల వంటి పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రం ఆటను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.
‘నా ఆట ఇంకా పూర్తి కాలేదు’
తన రిటైర్మెంట్ ప్రకటనలో చాహల్ ఎమోషనల్ అయ్యాడు. 'నేను మొదట పట్టుకున్నది రెడ్ బాల్‌నే. అప్పుడు నా వయసు 10 ఏళ్లు. ఓపిక, వ్యక్తిత్వం, పోరాట పటిమ అంటే ఏమిటో నాకు రెడ్ బాల్ క్రికెటే నేర్పింది. ప్రతి పరుగు కోసం, వికెట్ కోసం గంటల తరబడి పోరాడటంలో ఉన్న నిజమైన సంతోషాన్ని ఇందులో ఆస్వాదించాను. లార్డ్స్ మైదానంలో ఆడిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ నా కెరీర్‌కు ఆఖరిది. దేశం తరఫున టెస్టులు ఆడాలనేది నా డ్రీమ్. అది నెరవేరకపోయినా నా ఈ ప్రయాణం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నాను. అయితే నా క్రికెట్ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోలేదు' అని చాహల్ పేర్కొన్నాడు.
చాహల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్:
2009లో హర్యానా తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన చాహల్, 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో డొమెస్టిక్, కౌంటీ క్రికెట్‌లలో కలిపి 49 మ్యాచ్‌లు ఆడాడు. 32.27 సగటుతో మొత్తం 148 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడిన ఈ స్టార్ లెగ్ స్పిన్నర్, 2024 టీ20 ప్రపంచకప్ విజేత భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. భారత్ తరఫున చివరిగా ఆగస్టు 2023లో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్ ఆడిన చాహల్, వైట్ బాల్ ఫార్మాట్లలో రాబోయే సిరీస్‌ల కోసం ప్రత్యేక దృష్టి సారించనున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు 2026: భారత్‌కు పర్వీన్ హూడా పసిడి కానుక!
అఫ్గాన్ ప్లేయర్‌పై కాసుల వర్షం... కోట్లు ఖర్చు చేసిన ముంబై!