Share News

న్యూజిలాండ్ ‘ఎ’పై యశస్వి జైస్వాల్ విధ్వంసం..!

ABN , Publish Date - Nov 03 , 2026 | 08:46 PM

గత కొంతకాలంగా కాస్త ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన రీతిలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో జైస్వాల్ అజేయంగా 155 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

న్యూజిలాండ్ ‘ఎ’పై యశస్వి జైస్వాల్ విధ్వంసం..!
Yashasvi Jaiswal

స్పోర్ట్స్ డెస్క్: గత కొంతకాలంగా కాస్త ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన రీతిలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో జైస్వాల్ అజేయంగా 155 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ జైస్వాల్ బ్యాటింగ్ ప్రదర్శన టీమిండియాకు ఎంతో ఊరటనిచ్చింది.


ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్న భారత్-న్యూజిలాండ్ అధికారిక టెస్ట్ సిరీస్‌కు ముందు ఈ శతకం సాధించడం అతడి ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచనుంది. సెంచరీ అనంతరం జైస్వాల్ ప్లైయింగ్ కిస్ ఇస్తూ ప్రదర్శించిన హావభావాలు అందరిని ఆకర్షించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ పిచ్ పరిస్థితులపై మాట్లాడిన జైస్వాల్.. ఇక్కడి వాతావరణం తనకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని తెలిపారు.


'ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. ప్రారంభ ఓవర్ల నుంచే బంతి విపరీతంగా స్వింగ్ అవుతుంది. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసే బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆరంభంలో చాలా ఓపిక పట్టాల్సి వస్తుంది' అని జైస్వాల్ పేర్కొన్నాడు. పిచ్ పాతబడిన తర్వాత షాట్లు ఆడటం సులువవుతుందని, అయితే ఇక్కడ రాణించాలంటే క్రమశిక్షణ, సరైన దినచర్య ఎంతో అవసరమని జైస్వాల్ స్పష్టం చేశాడు.


శరీరానికి దగ్గరగా ఆడటమే తన బ్యాటింగ్ టెక్నిక్ అని, పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆటే తీరును మార్చుకున్నానని జైస్వాల్ వివరించాడు. అక్కడి ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటూ చేసిన ఈ సెంచరీ రాబోయే టెస్ట్ సిరీస్‌లో జైస్వాల్ పాత్ర ఎంత కీలకమో చాటు చెబుతోందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా హర్షం
పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ రిలీఫ్

జాతీయ సెలక్టర్లపై సర్ఫరాజ్ ఖాన్ అసహనం!

Updated Date - Nov 03 , 2026 | 09:18 PM