ఆర్సీబీ నన్ను రిటైన్ చేసుకుంటుందని ఊహించలేదు: యశ్ దయాళ్
ABN , Publish Date - Nov 23 , 2026 | 09:47 PM
ఐపీఎల్ 2027 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తనను రిటైన్ చేసుకోవడంపై ఎడమచేతి వాటం పేసర్ యశ్ దయాళ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్-2027 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తనను రిటైన్ చేసుకోవడంపై ఎడమచేతి వాటం పేసర్ యశ్ దయాళ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 2025లో ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన దయాళ్.. ఆ తర్వాత న్యాయపరమైన చిక్కుల కారణంగా ఐపీఎల్-2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. న్యాయపరమైన కేసులు ముగియడంతో దేశవాళీ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన అతడిని ఆర్సీబీ యాజమాన్యం మరోసారి నిలుపుదల చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టు తనను నిలుపుదల చేసుకోవడంపై దయాళ్ స్పందించాడు. ఓ జాతీయ మీడియాతో దయాళ్ మాట్లాడుతూ..'ఆర్సీబీ నన్ను రిటైన్ చేస్తుందని అస్సలు ఊహించలేదు. నాపై నమ్మకం ఉంచి జట్టులో ఉంచుకోవడం చాలా పెద్ద విషయం. నాకున్న అనుభవంతో ఈ సీజన్‌లో 100 శాతం శ్రమించి జట్టుకు మంచి ప్రదర్శన ఇస్తాను’ అని ధీమా వ్యక్తం చేశాడు. ఆర్సీబీ వరుసగా టైటిల్ నిలబెట్టుకున్న ఐపీఎల్-2026 సీజన్‌ను బయట కూర్చుని టీవీలో చూడాల్సి రావడం బాధ కలిగించిందని పేర్కొన్నాడు. 'మన సహచరులు ఆడుతుంటే మనం ఇంట్లో ఉండి టీవీలో చూడటం కష్టంగా ఉంటుంది. కానీ, ఇప్పుడు మళ్లీ ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నాడు.
ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ2026లో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న 28 ఏళ్ల దయాళ్.. తన పునరాగమనంలో భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇచ్చిన సలహాలు, మద్దతు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు. చిన్న మైదానాల్లో బౌలింగ్ చేయడం సవాలుతో కూడుకున్నప్పటికీ ఆ సవాలును ఇష్టపడతానని, వీలైనంత త్వరగా భారత జట్టు తరఫున ఆడటమే తన లక్ష్యమని దయాళ్ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. టీమిండియా కీలక నిర్ణయం
డ్రా అయినా టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు..