Share News

డేంజరస్ పిచ్.. అర్ధాంతరంగా మ్యాచ్ రద్దు

ABN , Publish Date - Apr 22 , 2026 | 11:49 AM

ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్‌ హ్యూస్‌ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెట్‌ వెస్టిండీస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న వెస్టిండీస్‌ ఛాంపియన్‌షిప్‌లో అదే తరహా ఘటన చోటు చేసుకుంది.

డేంజరస్  పిచ్.. అర్ధాంతరంగా మ్యాచ్ రద్దు
West Indies Championship injury

స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్‌ హ్యూస్‌(Phillip Hughes) ఘటన క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. 2014 నవంబర్ 27 దేశవాళీ క్రికెట్‌లో భాగంగా మ్యాచ్ ఆడుతున్న సమయంలో హ్యూస్ మెడకు బంతి తగిలి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా క్రికెట్‌ వెస్టిండీస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న వెస్టిండీస్‌ ఛాంపియన్‌షిప్‌లో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. కానీ, ఈ ఘటనలో సదరు ప్లేయర్‌కు ప్రాణాపాయం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


వెస్టిండీస్‌ ఛాంపియన్‌షిప్‌(West Indies Championship)లో భాగంగా సర్‌ వివియన్‌ స్టేడియం వేదికగా లీవార్డ్ ఐలాండ్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ట్రినిడాడ్ పేసర్ జేడన్‌ సీల్స్‌ వేసిన బంతి.. లీవార్డ్ ఐలాండ్స్ బ్యాటర్‌ జెర్మియా లూయిస్‌ హెల్మెట్‌ను బలంగా తాకింది. ఊహించని విధంగా బౌన్స్ కావడంతో బంతి ఒక్కసారిగా తలపైకి దూసుకువచ్చి లూయిస్‌ను కిందపడేసింది. నొప్పితో లాయిస్ విలవిల్లాడాడు. కొద్దిసేపటి తర్వాత లేచినప్పటికీ, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ హెల్మెట్‌ను కాలితో తన్నాడు. అంతేకాక ఆగ్రహంతో కాసేపు పిచ్‌ను కొట్టాడు. అనంతరం సిబ్బంది అతడిని స్ట్రెచర్‌పై ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.


ఈ ఘటన తర్వాత మ్యాచ్ అధికారులతో పాటు అంపైర్లు చర్చలు జరిపారు. పిచ్ ప్రమాదకరంగా ఉందని గుర్తించిన వారు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆట కొనసాగితే ప్లేయర్లకు గాయాలు తప్పవని తెలిసి మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. పిచ్ అస్థిరంగా ఉండటం వల్ల ఈ మ్యాచ్‌లో ఇప్పటికే అనేక వికెట్లు పడిపోయాయి. బంతి ఎలా బౌన్స్ అవుతుందో అంచనా వేయడం బ్యాటర్లకు కష్టమైంది. సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరికరాలు మెరుగుపడినా పిచ్ నాణ్యతలో లోపాలు ఉంటే ప్రమాదాలు తప్పవని ఈ ఘటన స్పష్టం చేసిందని క్రీడా నిపుణులు అభిప్రాయాపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

రైజర్స్‌.. రయ్‌ రయ్‌

ఐపీఎల్‌లో ‘బ్లాక్‌ మ్యాజిక్‌’ నిజమే!

Updated Date - Apr 22 , 2026 | 12:09 PM