రైజర్స్.. రయ్ రయ్
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:07 AM
సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి మరో ఆల్‌రౌండ్‌షో. సొంత గడ్డపై ఎదురులేని ఆటతీరుతో చెలరేగిన ఈ జట్టు ఖాతాలో హ్యాట్రిక్ విజయం చేరింది. ఉప్పల్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ...
మహిళల మూడో టీ20 నేడు
భారత్ X దక్షిణాఫ్రికా (రా. 9.30)
నేటి మ్యాచ్
లఖ్‌నవూ X రాజస్థాన్
వేదిక లఖ్‌నవూ, రా.7.30 నుంచి
47 రన్స్ తేడాతో హ్యాట్రిక్ విజయం
అభిషేక్ మెరుపు సెంచరీ
ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశ
పేసర్ మలింగకు నాలుగు వికెట్లు
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి మరో ఆల్‌రౌండ్‌షో. సొంత గడ్డపై ఎదురులేని ఆటతీరుతో చెలరేగిన ఈ జట్టు ఖాతాలో హ్యాట్రిక్ విజయం చేరింది. ఉప్పల్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 నాటౌట్) ఆకాశమే హద్దుగా అజేయ శతకంతో చెలరేగాడు. ఇక భారీ స్కోరు ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను పేసర్ ఎషాన్ మలింగ (4/32) అడ్డుకున్నాడు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజర్స్ 47 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే 8 పాయింట్లతో టాప్-3కి చేరింది. ముందుగా సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 242 పరుగులు చేసింది. క్లాసెన్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్), హెడ్ (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) రాణించారు. అక్షర్‌కు ఓ వికెట్ దక్కింది. ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు చేసి ఓడింది. నితీశ్ రాణా (30 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57), రిజ్వీ (28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), రాహుల్ (23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 37) ఫర్వాలేదనిపించారు. హర్ష్ దూబేకు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా అభిషేక్ నిలిచాడు.
దెబ్బతీసిన మలింగ: భారీ ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లను పేసర్ ఎషాన్ మలింగ వణికించాడు. వారినేమాత్రం కుదురుకోనీయకుండా కీలక వికెట్లతో కట్టడి చేశారు. ఓపెనర్ నిస్సాంక (8) మూడో ఓవర్‌లోనే వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ రాహుల్ ఆటలో వేగం కనిపించలేదు. అయితే నితీశ్ రాణా మాత్రం నాలుగో ఓవర్‌లో 4,6,4తో ఎదురుదాడికి దిగాడు. పవర్‌ప్లేలో జట్టు 59/1తో ఫర్వాలేదనిపించింది. అటు శివాంగ్ ఓవర్‌లోనే రాణా 6,6,4తో 19 రన్స్ అందించాడు. 27 బంతుల్లోనే రాణా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా.. రాహుల్‌ను పేసర్ సకీబ్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 86 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. అలాగే పేసర్ ఎషాన్ మలింగ 11వ ఓవర్‌లో నితీశ్, మిల్లర్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేసి ఢిల్లీకి ఓటమిని కళ్లముందుంచాడు. అయితే స్టబ్స్ (27), సమీర్ రిజ్వీ అడపాదడపా బౌండరీలతో కాస్త ఆశలు రేపారు. కానీ మరోసారి మలింగే దెబ్బతీస్తూ స్టబ్స్‌ను అవుట్ చేయడంతో ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యానికి చెక్ పడింది. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ 20కి చేరడంతో ఢిల్లీ పోరాటం ఏమాత్రం సరిపోలేదు.
అభిషేక్ చివరికంటా..: వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఢిల్లీ కెప్టెన్ అక్షర్ అంచనాలను వమ్ము చేస్తూ ఓపెనర్ అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచాడు. పేసర్, స్పిన్నర్ అనే తేడా లేకుండా బౌండరీల వరద పారించడంతో రైజర్స్ స్కోరుబోర్డు రయ్‌మంటూ సాగింది. ఢిల్లీ బౌలర్లకు అలసట తప్ప వికెట్లు మాత్రం దక్కలేదు. తొలి నాలుగు ఓవర్ల వరకు ఒక్క సిక్సర్ కూడా నమోదు కాకపోయినా.. ఆ తర్వాత అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐదో ఓవర్‌లో శర్మ 6,6 మరో ఓపెనర్ హెడ్ 6తో 20 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో జట్టు 67 పరుగులతో నిలిచింది. అభిషేక్ 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ రాహుల్ రనౌట్ చేయడంలో విఫలమయ్యాడు. హెడ్‌ను స్పిన్నర్ అక్షర్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక 11వ ఓవర్‌లో ఇషాన్ (25) 6,4,4.. అభిషేక్ 6తో మరో 22 పరుగులు సమకూరాయి. నితీశ్ రాణా ఓవర్‌లో అభిషేక్ 6,6,4తో 47 బంతుల్లోనే లీగ్‌లో రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్‌లో ఇషాన్ రనౌట్ కావడంతో రెండో వికెట్‌కు 35 బంతుల్లో 79 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు క్లాసెన్ కూడా వచ్చీరాగానే బ్యాట్‌కు పనిచెప్పాడు. 19వ ఓవర్‌లో పేసర్ నటరాజన్ ఆరు పరుగులే ఇచ్చినప్పటికీ.. ఆఖరి ఓవర్‌లో క్లాసెన్ 4,6,4 అభిషేక్ 4తో 20 పరుగులు వచ్చాయి. దీంతో స్కోరు 240+ దాటింది. అంతేకాకుండా మూడో వికెట్‌కు అభిషేక్-క్లాసెన్ మధ్య అజేయంగా 66 పరుగులు జత చేరాయి.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్: అభిషేక్ (నాటౌట్) 135, హెడ్ (సి) రిజ్వీ (బి) అక్షర్ 37, ఇషాన్ (రనౌట్) 25, క్లాసెన్ (నాటౌట్) 37, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 242/2; వికెట్ల పతనం: 1-97, 2-176; బౌలింగ్: ముకేశ్ 4-0-53-0, నితీశ్ రాణా 4-0-55-0, ఎన్‌గిడి 4-0-41-0, అక్షర్ 2-0-23-1, కుల్దీప్ 2-0-30-0, నటరాజన్ 4-0-40-0.
ఢిల్లీ: నిస్సాంక (సి/సబ్) లివింగ్‌స్టోన్ (బి) మదుశంక 8, రాహుల్ (సి) అభిషేక్ (బి) సకీబ్ 37, నితీశ్ రాణా (సి) అభిషేక్ (బి) మలింగ 57, రిజ్వీ (సి) మదుశంక (బి) హర్ష్ దూబే 41, మిల్లర్ (బి) మలింగ 0, స్టబ్స్ (సి) సకీబ్ (బి) మలింగ 27, అశుతోష్ (సి) అనికేత్ (బి) మలింగ 14, అక్షర్ (సి) నితీశ్ రెడ్డి (బి) హర్ష్ దూబే 2, కుల్దీప్ (నాటౌట్) 1, ఎన్‌గిడి (సి) మదుశంక (బి) హర్ష్ దూబే 0, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 195/9; వికెట్ల పతనం: 1-21, 2-107, 3-107, 4-107, 5-166, 6-186, 7-192, 8-195, 9-195; బౌలింగ్: మదుశంక 4-0-36-1, నితీశ్ రెడ్డి 4-0-57-0, మలింగ 4-0-32-4, సకీబ్ హుస్సేన్ 4-0-29-1, శివాంగ్ 2-0-28-0, హర్ష్ దూబే 2-0-12-3.
1
టీ20ల్లో 130+ స్కోర్లు అత్యధికసార్లు (4) సాధించిన బ్యాటర్‌గా అభిషేక్.
2
ఒక ఇన్నింగ్స్‌లో పది లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లను అత్యధిక సార్లు (5 సార్లు) బాదిన రెండో బ్యాటర్‌గా అభిషేక్. క్రిస్ గేల్ (18 సార్లు) టాప్‌లో ఉన్నాడు.
3
ఐపీఎల్‌లో వేగంగా (52 ఇన్నింగ్స్) 100 సిక్స్‌లు బాదిన మూడో బ్యాటర్‌గా క్లాసెన్. గేల్ (37), రస్సెల్ (47) ముందున్నారు.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
పంజాబ్ 6 5 0 1 11 1.420
బెంగళూరు 6 4 2 0 8 1.171
హైదరాబాద్ 7 4 3 0 8 0.820
రాజస్థాన్ 6 4 2 0 8 0.599
ఢిల్లీ 6 3 3 0 6 -0.130
గుజరాత్ 6 3 3 0 6 -0.821
ముంబై 6 2 4 0 4 0.067
చెన్నై 6 2 4 0 4 -0.780
లఖ్‌నవూ 6 2 4 0 4 -1.173
కోల్‌కతా 7 1 5 1 3 -0.879
ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!
కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్