Share News

పదేళ్ల తర్వాత కోహ్లీ పశ్చాత్తాప పడతాడు: కపిల్ దేవ్

ABN , Publish Date - Nov 17 , 2026 | 01:14 PM

టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ నిర్ణయంపై భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ తీసుకున్న ఆ నిర్ణయం అతిపెద్ద తప్పని, పదేళ్ల తర్వాత అతడు కచ్చితంగా పశ్చాత్తాపపడతాడంటూ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పదేళ్ల తర్వాత  కోహ్లీ పశ్చాత్తాప పడతాడు: కపిల్ దేవ్
Virat Kohli

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గతేడాది మే నెలలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అతడి నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు. విరాట్ రిటైర్మెంట్ ప్రకటించి ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ దీని గురించి తరచూ మాజీ క్రికెటర్లు ప్రస్తావిస్తుంటారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) కూడా కోహ్లీ నిర్ణయంపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. టెస్ట్ క్రికెట్‌ నుంచి రిటైర్ కావాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయం అతడి కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. ఎంతో ఫిట్‌గా ఉన్న విరాట్‌కు రెడ్ బాల్ ఫార్మాట్‌లో ఇంకా రాణించగల సత్తా ఉందని అభిప్రాయపడ్డారు.


ఓ ఇంటర్వ్యూలో కపిల్ మాట్లాడుతూ..‘కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయి అతిపెద్ద తప్పు చేశాడని అనుకుంటున్నా. అతడు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వకుండా ఉండాల్సింది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు పదేళ్ల తర్వాత కోహ్లీ (Virat Kohli) పశ్చాత్తాపపడతాడు. అతడికి ఉన్నంత అద్భుతమైన ఫిట్‌నెస్ మరే ఆటగాడికి లేదు.ఈ విషయంలో 25 ఏళ్ల క్రికెటర్‌కు కూడా కోహ్లీ సవాల్ విసరగలడు. ఆవేశంలో, కోపంతో రిటైర్ అవ్వడం ఏమాత్రం సరికాదు. రిటైర్మెంట్ విషయంలో మొహిందర్ అమర్‌నాథ్‌లా ఉండాలి. అతడిని ఎన్నోసార్లు జట్టు నుంచి తొలగించారు. కానీ, తిరిగి జట్టులో చోటు సంపాదించుకుని విమర్శకుల నోళ్లు మూయించారు’ అని కపిల్ దేవ్ గుర్తుచేసుకున్నారు.


తన కెరీర్‌లో 123 టెస్టులు ఆడిన కోహ్లీ.. 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు, ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2025 జనవరిలో సిడ్నీలో ఆస్ట్రేలియాపై ఆడాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 74 పరుగులు చేసిన అతడు తర్వాత మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది 13 ఇన్నింగ్స్‌ల్లో 638 పరుగులు చేశాడు.


ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. పంత్‌పై గిల్ కీలక ప్రకటన!

జయదేవ్ ఉనాద్కత్‌పై శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు..

సౌతాఫ్రికా గ‌డ్డ‌పై బంగ్లాదేశ్‌ అరుదైన ఘనత.. తొలిసారి 400 మార్క్..

Updated Date - Nov 17 , 2026 | 01:32 PM