అమెరికా, ఇరాన్ యుద్ధం.. పాక్ క్రికెట్ జట్టు భారీ నష్టం
ABN , Publish Date - Mar 01 , 2026 | 04:40 PM
అమెరికా-ఇరాన్ యుద్ద ప్రభావం క్రికెట్ ప్రపంచంపై కూడా పడింది. పాకిస్థాన్ షాహీన్స్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ లయన్స్ రద్దు చేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ సుప్రీం కమాండ్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ యుద్ధ ప్రభావం అనేక వస్తువులు, క్రూడాయిల్ వంటి వాటి ధరలపై ప్రభావం చూపింది. తాజాగా క్రికెట్ ప్రపంచంపై కూడా యూఎస్-ఇరాన్ యుద్ధ ప్రభావం పడింది. అమెరికా, ఇరాన్ యుద్ధంలో నష్టపోయిన తొలి క్రికెట్ జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అమెరికా-ఇరాన్ యుద్ద కారణంగా పాకిస్థాన్ షాహీన్స్‌తో (ఏ జట్టు) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ లయన్స్ (ఏ జట్టు) రద్దు చేసుకుంది. ఈ సిరీస్ యూఏఈలోని అబుదాబీ వేదికగా జరుగుతుంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ .. యూఎస్ఏ ఎయిర్‌బేస్‌ల్లో ఒకటైన అబుదాబీని టార్గెట్ చేసింది. ఇరాన్ క్షిపణులతో అబుదాబీపై విరుచుకుపడుతుంది. శక్తివంతమైన బాలిస్టిక్ మిసైళ్లతో దాడులతో అబుదాబీ అట్టుడికిపోతుంది. అక్కడే ఇంగ్లండ్ లయన్స్ జట్టు, వారి సపోర్ట్ స్టాఫ్ చిక్కుకుపోయారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ (శనివారం) ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ లయన్స్, పాకిస్థాన్ షాహీన్స్ మధ్య అనధికారిక రెండో వన్డే జరగాల్సి ఉండింది. అయితే భద్రతా కారణాల వల్ల ఈ మ్యాచ్‌తో పాటు మిగతా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జట్టు భద్రత తమ తొలి ప్రాధాన్యమని, అబుదాబీ పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఇంగ్లండ్ లయన్స్, పాకిస్థాన్ షాహీన్స్ మధ్య అనధికారికంగా 3 టీ20లు, 5 వన్డే మ్యాచ్‌ల షెడ్యూలైంది. వీటిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అబుదాబీ వేదికగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తొలుత టీ20లు జరగగా.. ఇంగ్లండ్ 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అలానే 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 27న జరిగిన తొలి వన్డేలోనూ ఇంగ్లండే విజయం సాధించింది. ఇవాళ జరగాల్సిన రెండో వన్డే తో పాటు 3, 4, 5 వన్డేలు మార్చి 4, 6, 9 తేదీల్లో జరగాల్సి ఉంది. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఈ సిరీస్ రద్దైంది. దీంతో పాకిస్థాన్‌కు భారీ ఆర్థిక నష్టం జరుగుతుందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ
టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్