Share News

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్: వాంఖడేలో ‘సెమీ’ ఫైట్.. ఆ సెంటిమెంట్‌కు తెరపడుతుందా?

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:28 PM

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 సెమీ ఫైనల్‌లో భారత్-ఇంగ్లండ్ జట్లు నేడు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. ఈ మ్యాచులో గెలిస్తేనే ఫైనల్‌కు వెళ్లి మరోసారి టీ20 ప్రపంచ కప్ ఎత్తుకునే అవకాశం లభిస్తుంది.

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్: వాంఖడేలో ‘సెమీ’ ఫైట్.. ఆ సెంటిమెంట్‌కు తెరపడుతుందా?
IND vs ENG, T20 WC

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని వాంఖడే స్టేడియం మరో చారిత్రాత్మక పోరుకు సిద్ధమైంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 సెమీ ఫైనల్‌లో భారత్-ఇంగ్లండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. సూపర్ 8లో గ్రూప్ 1 నుంచి సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలవగా.. ఓ మ్యాచ్ ఓడి సంక్లిష్ట పరిస్థితుల్లో గ్రూప్ 2 నుంచి రెండో స్థానంలో సెమీస్‌కు చేరింది టీమిండియా. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. ఈ మ్యాచులో గెలిస్తేనే ఫైనల్‌కు వెళ్లి మరోసారి టీ20 ప్రపంచ కప్ ఎత్తుకునే అవకాశం లభిస్తుంది.


సెంటిమెంట్ల ‘సెమీ’

వాంఖడేలో జరగనున్న ఈ సెమీ ఫైనల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ మెగా టోర్నీ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌లో తలపడినప్పుడు ఎవరు గెలిస్తే వారే ట్రోఫీని ముద్దాడారు. 2022లో సెమీస్‌లో భారత్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లండ్.. ఆ తర్వాత కప్పు కొట్టింది. 2024లో ఇదే ఇంగ్లండ్‌పై 68 పరుగుల తేడాతో ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. చివరకు జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ‘ఈ మ్యాచ్ గెలిచిన వారే.. విశ్వవిజేతలు’ అనే ట్రెండ్ ఇరు జట్లను ఒత్తిడిలోకి నెడుతోంది.


వాంఖడే కోటలో భారత్ జోరు!

తమ సొంత గడ్డపై టీమిండియాకు తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 7 టీ20ల్లో భారత జట్టు 5 విజయాలు సాధించి పట్టు బిగించింది. మరోవైపు ఇంగ్లండ్ ఇక్కడ 6 మ్యాచ్‌లు ఆడి కేవలం 3 విజయాలతో సరిపెట్టుకుంది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన వాంఖడే పిచ్‌పై టాస్ గెలిచిన జట్టుకు స్వల్ప సానుకూలత ఉండే అవకాశం ఉంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉన్నందున బౌలర్లకు ఇది కఠిన పరీక్షే.


అదే జరిగితే..

సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. నేడు జరిగే సెమీ ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే.. ఫైనల్‌లో కఠిన సవాలునే ఎదుర్కోవాలి. ఎందుకుంటే ఈ పిచ్ టీమిండియాకు అచ్చిరాదనే విషయం అందరికీ తెలిసిందే. 2023 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఇదే స్టేడియంలో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. టోర్నీ అంతా అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. టీ20 ప్రపంచ కప్ 2026లోనూ లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించిన టీమిండియా.. సూపర్ 8లో సౌతాఫ్రికాపై జరిగిన తొలి మ్యాచులో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ కూడా నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగడం గమనార్హం. మళ్లీ ఇదే అచ్చిరాని మైదానంలో ఫైనల్‌లో తలపడటం టీమిండియాకు సవాలుతో కూడుకున్న పనే. ఈ సెంటిమెంట్‌కు భారత్ తెరదించుతుందా? వరుసగా రెండో సారి టీమిండియా.. టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడుతుందా? అనేది చూడాల్సి ఉంది.


ఇవీ చదవండి:

ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్

మరోసారి ఉదారతను చాటుకున్న సోనూసూద్.. ఆ ప్రయాణికులకు భరోసా

Updated Date - Mar 05 , 2026 | 05:28 PM