టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్
ABN , Publish Date - Mar 09 , 2026 | 10:33 AM
భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితం చేస్తున్నానని తెలిపాడు. తన కష్ట కాలంలో తనకు మద్దతుగా నిలిచిన వ్యక్తుల్లో జై షా కూడా ఉన్నారని గంభీర్ వెల్లడించాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) విశ్వవిజేతగా భారత్ అవతరించిన సంగతి తెలిసిందే. నిన్న(ఆదివారం) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి, మొత్తంగా మూడుసార్లు టైటిల్ అందుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. మ్యాచ్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎమోషనలయ్యాడు. ఈ ట్రోఫీని ఇద్దరు వ్యక్తులకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ... ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. రాహుల్ భారత జట్టును ఈ స్థాయికి తీసుకువచ్చాడని, అలాగే లక్ష్మణ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో యువ ఆటగాళ్లకు బలమైన మార్గాన్ని నిర్మించాడని గంభీర్ వివరించాడు. అదే విధంగా తాను సోషల్ మీడియాలోని జనాలకు కాదని, జట్టుకు మాత్రమే జవాబుదారీనని గంభీర్ పేర్కొన్నాడు. అందుకే జనాలు చేసే విమర్శలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఒక కోచ్ అనే వాడు తన జట్టు ఎంత గొప్పగా ఆడితే అంత గొప్పగా కనిపిస్తాడని, తనను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది ఆటగాళ్లేనని గంభీర్ అన్నాడు.
అదే సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ఐసీసీ చైర్మన్ జై షాకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా తన కోచింగ్ కాలంలో ఎదురైన కష్ట సమయంలో జై షా తనకు మద్దతు నిలిచాడని గంభీర్ వ్యక్తం చేశాడు. అజిత్ అగార్కర్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా నిజాయితీగా తన పని చేశాడని గంభీర్ చెప్పాడు. ఈ విజయానికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్రను కూడా గంభీర్ ప్రస్తావించాడు. సూర్య పని చాలా సులభం చేశాడని, అతను జట్టుకు ఒక తండ్రిలాంటి నాయకుడంటూ ప్రశంసించాడు.
ఇవి కూడా చదవండి:
ఆ సమయంలో సచిన్ చాలా సహాయం చేశారు: సంజూ శాంసన్
ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..