మరో ప్రపంచం.. మురిసె భారతం
ABN , Publish Date - Mar 09 , 2026 | 02:50 AM
అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఈ పోరులో భారత్ 96 రన్స్ తేడాతో ఘనవిజయం సాధిస్తూ.. వరుసగా రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఓవరాల్‌గా మూడు టైటిళ్లు...
డబ్బే డబ్బు
విజేతకు - రూ. 27.48 కోట్లు
రన్నర్‌పనకు - 14.65 కోట్లు
సూర్య సేనదే టీ20 ప్రపంచకప్
సందేహాలన్నీ పటాపంచలయ్యాయి.. ఫైనల్‌కు ముందు అభిమానుల మదిలో ఎన్ని ప్రశ్నలో? ఇదే వేదికపై 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమి కళ్ల ముందే ఉంది.. అటు చూస్తే ఈ టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్‌పై గెలిచిన ఉదంతాలే లేవు. అందుకే ఆదివారం జరిగే అంతిమ పోరులో మనోళ్ల పరిస్థితి ఏమిటనే ఉత్కంఠ అందరిలోనూ కనిపించింది. కానీ చివరి అడుగులో సూర్యకుమార్ సేన సింహంలా గర్జించింది. ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే సాధించి అందరినీ తలెత్తుకుని చిందేసేలా చేసింది. అటు బ్యాటింగ్‌లో శాంసన్, ఇషాన్, అభిషేక్ త్రయం రికార్డుల మోతతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. అయినా ఫ్లాట్ పిచ్‌పై ఎంత స్కోరైనా ప్రమాదకరమే అనిపించిన వేళ.. భారత జట్టు బౌలర్లు మేమున్నామంటూ అండగా నిలిచారు. పకడ్బందీ బంతులతో కివీస్ బ్యాటర్లను కుమ్మేశారు. కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఫలితంగా.. వరుసగా రెండోసారి కప్‌ను సాధించి హిస్టరీని రిపీట్ చేశాం.అంతేనా.. కివీ్‌సపై గెలవని అపఖ్యాతిని.. ఆతిథ్య దేశం ట్రోఫీని సాధించదనే సెంటిమెంట్‌నూ బ్రేక్ చేసి హిస్టరీని డిఫీట్ కూడా చేశాం.. జయహో భారత్
టీమిండియా ఖాతాలో వరుసగా రెండో టైటిల్
ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయం
శాంసన్, ఇషాన్, అభిషేక్ అర్ధసెంచరీలు
అహ్మదాబాద్: అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఈ పోరులో భారత్ 96 రన్స్ తేడాతో ఘనవిజయం సాధిస్తూ.. వరుసగా రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఓవరాల్‌గా మూడు టైటిళ్లు సాధించిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. 2007లో ధోనీ, 2024లో రోహిత్ నేతృత్వంలోనూ టైటిల్స్ దక్కాయి. మరోవైపు కివీస్ ఫైనల్స్‌కు వచ్చిన రెండుసార్లు కూడా రన్నర్‌పతో సంతృప్తి పడాల్సి వచ్చింది. అలాగే గతంలో మూడుసార్లు కివీ్‌సపై ఓడిన భారత్ ఈసారి గట్టిగానే బదులు తీర్చుకున్నట్టయ్యింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. శాంసన్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89), ఇషాన్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), అభిషేక్ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. దూబే (8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. నీషమ్‌కు మూడు వికెట్లు లభించాయి. ఛేదనలో కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులు చేసి చిత్తయ్యింది. సైఫర్ట్ (26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52), శాంట్నర్ (35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) మాత్రమే రాణించారు. బుమ్రాకు 4, అక్షర్‌కు 3 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ద సిరీ్‌సగా శాంసన్ నిలిచాడు.

తేలిపోయారు: కష్టసాధ్యమైన ఛేదనలో కివీస్ ఏ దశలోనూ విజయం వైపు సాగలేకపోయింది. టాపార్డర్ దారుణంగా విఫలం కాగా.. చివర్లో శాంట్నర్ కాస్త బ్యాట్ ఝుళిపించాడు. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్న సైఫర్ట్-అలెన్ (9) జోడీ ఇక్కడా చెలరేగుతుందని భయపడినా.. భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. ఆరంభంలో సైఫర్ట్ మాత్రమే దూకుడు కనబర్చినా అతడికి ఎలాంటి సహకారం అందలేదు. మూడో ఓవర్‌లోనే అలెన్‌ను అక్షర్ దెబ్బతీయడం కలిసివచ్చింది. ఇక ఆ తర్వాత బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ పక్షమే నిలిచింది. ఊపు మీదున్న సైఫర్ట్ 23 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి వరుణ్ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఇక అక్కడి నుంచి కివీ్‌సకు ఎలాంటి ఆశలు లేకపోయింది. ఆరో వికెట్‌కు శాంట్నర్-మిచెల్ (17) మధ్య వచ్చిన 52 పరుగుల భాగస్వామ్యమే అత్యధికంగా నిలిచింది. 16వ ఓవర్‌లో బుమ్రా రెండు వరుస వికెట్లతో చావుదెబ్బ తీశాడు. అభిషేక్ చివరి వికెట్ తీయడంతో మరో ఓవర్ ఉండగానే మ్యాచ్‌ను ముగించి భారత్ సంబరాలు చేసుకుంది.
టాపార్డర్ మెరుపులు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు టాపార్డర్ నుంచి అదిరే ఆరంభం దక్కింది. ఫ్లాట్ పిచ్ కావడంతో బౌలర్లకు ఎలాంటి సహకారం లభించలేదు. దీంతో ఓపెనర్లు శాంసన్, అభిషేక్‌తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ సైతం బ్యాట్ ఝుళిపించాడు. వీరి ధాటికి భారత స్కోరు ఓ దశలో 300 కూడా సాధ్యమేనేమో అనిపించింది. కానీ పేసర్ నీషమ్ 16వ ఓవర్‌లో ట్రిపుల్ ధమాకాతో కట్టడి చేశాడు. ఈ దెబ్బకు 250 స్కోరుపైనా సందేహాలు నెలకొన్నాయి. కానీ ఆఖరి ఓవర్‌లో శివమ్ దూబే శివాలెత్తాడు. దీంతో కివీస్ ముందు సవాల్ విసిరే లక్ష్యం ఉంచినట్టయ్యింది. అటు కివీస్ కెప్టెన్ శాంట్నర్ వ్యూహాలు కూడా బెడిసికొట్టాయి. మరోవైపు తొలి రెండు ఓవర్లు ప్రశాంతంగా సాగినా ఆ తర్వాత పరుగుల వరదకు తెర లేచింది. జట్టులో చోటు అవసరమా? అని విమర్శించిన వారికి అభిషేక్ బ్యాట్‌తో సమాధానమిచ్చాడు. రెండో ఓవర్‌లో ఆఫ్ స్పిన్నర్ ఫిలి్‌ప్సను జాగ్రత్తగా ఎదుర్కొన్నాక ఇక అతడికి అడ్డు లేకపోయింది. పేసర్లను ఆటాడేసుకుంటూ బౌండరీలతో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్నాడు. అటు మరో ఎండ్‌లో శాంసన్ కాస్త తగ్గి తనకే ఎక్కువ స్ట్రయిక్ వచ్చేలా చూశాడు. నాలుగో ఓవర్‌లో అభిషేక్ 4,6 శాంసన్ 6,4తో 24 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఓవర్‌లో హెన్రీ నాలుగు వైడ్లు, రెండు సిక్సర్లు సమర్పించుకోవడంతో 21 రన్స్ సమకూరాయి. దీనికితోడు డఫీ ఓవర్‌లో అభిషేక్ 4,6,4,2,4తో 20 రన్స్ రాబట్టగా పవర్‌ప్లేలో భారత్ 92 రన్స్‌తో అత్యంత పటిష్ఠ స్థితిలో నిలిచింది. అటు 18 బంతుల్లోనే అభిషేక్ ఫిఫ్టీ కూడా పూర్తి చేశాడు. అయితే రచిన్ తన తొలి బంతికే శర్మ వికెట్ తీయడంతో తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం శాంసన్‌కు ఇషాన్ జత కలవడంతో పరుగుల వేగం తగ్గలేదు. అటు శాంసన్ 33 బంతుల్లో తన హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫెర్గూసన్ ఓవర్‌లో శాంసన్ 6,6,4 ఇషాన్ 6తో ఏకంగా 24 రన్స్ రావడంతో స్కోరు 66 బంతుల్లోనే 161కి చేరింది. ఇక రచిన్ ఓవర్‌లో సంజూ వరుసగా మూడు సిక్సర్లతో అదుర్స్ అనిపించాడు. 23 బంతుల్లోనే ఇషాన్ హాఫ్ సెంచరీ పూర్తిచేయగా, ఈసారి శాంసన్ శతకం ఖాయమనిపించింది.
దూబే దంచుడు: పేసర్ నీషమ్ 16వ ఓవర్‌లో భారత్‌కు గట్టి ఝలక్ ఇచ్చి జట్టు లయను దెబ్బతీశాడు. శతకం ముంగిట శాంసన్‌తో పాటు ఇషాన్, సూర్య (0)ల వికెట్లు తీయడంతో స్టేడియం మూగబోయింది. ఆ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే రావడం గమనార్హం. ఆ తర్వాత జట్టుకు మూడు ఓవర్లలో 27 పరుగులే రాగా హార్దిక్ (18) వికెట్ కోల్పోయింది. కానీ చివరి ఓవర్‌లో శివమ్ దూబే శివాలెత్తాడు. నీషమ్ బంతులను చెడుగుడు ఆడేస్తూ 4,6,6,4,4తో 24 రన్స్‌తో స్కోరును 250 దాటించాడు.
స్కోరుబోర్డు
భారత్: సంజూ శాంసన్ (సి/సబ్) మెకాంచి (బి) నీషమ్ 89, అభిషేక్ (సి) సైఫర్ట్ (బి) రచిన్ 52, ఇషాన్ (సి) చాప్‌మన్ (బి) నీషమ్ 54, హార్దిక్ (సి) శాంట్నర్ (బి) హెన్రీ 18, సూర్యకుమార్ (సి) రచిన్ (బి) నీషమ్ 0, తిలక్ (నాటౌట్) 8, శివమ్ దూబె (నాటౌట్) 26, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 255/5; వికెట్ల పతనం: 1-98, 2-203, 3-204, 4-204, 5-226; బౌలింగ్: హెన్రీ 4-0-49-1, ఫిలిప్స్ 1-0-5-0, డఫీ 3-0-42-0, ఫెర్గూసన్ 2-0-48-0, శాంట్నర్ 4-0-33-0, రచిన్ రవీంద్ర 2-0-32-1, నీషమ్ 4-0-46-3.
న్యూజిలాండ్: సైఫర్ట్ (సి) ఇషాన్ (బి) వరుణ్ 52, ఫిన్ అలెన్ (సి) తిలక్ (బి) అక్షర్ 9, రచిన్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 1, గ్లెన్ ఫిలిప్స్ (బి) అక్షర్ 5, చాప్‌మన్ (హార్దిక్) 3, డారిల్ మిచెల్ (సి) ఇషాన్ (బి) అక్షర్ 17, శాంట్నర్ (బి) బుమ్రా 43, నీషమ్ (బి) బుమ్రా 8, హెన్రీ (బి) బుమ్రా 0, ఫెర్గూసన్ (నాటౌట్) 6, డఫీ (సి) తిలక్ (బి) అభిషేక్ 3, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 19 ఓవర్లలో 159 ఆలౌట్; వికెట్ల పతనం: 1-31, 2-32, 3-47, 4-70, 5-72, 6-124, 7-141, 8-141, 9-152, 10-159; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-32-0, హార్దిక్ పాండ్యా 4-0-36-1, అక్షర్ పటేల్ 3-0-27-3, బుమ్రా 4-0-15-4, వరుణ్ చక్రవర్తి 3-0-39-1, అభిషేక్ 1-0-5-1.

భారత్ తీన్‌మార్
2007 (ధోనీ సారథ్యంలో)
2024 (రోహిత్ నాయకత్వంలో)
2026 (సూర్యకుమార్ కెప్టెన్సీలో)
అంచనాలకు మించి..
అద్భుతం!
టీ20..నిస్సందేహంగా ప్రస్తుతం వరల్డ్ క్రికెట్‌ను ఏలుతున్న ఆట. టెస్ట్‌లను అభిమానించే వారికి ఈ ఫార్మాట్‌పట్ల ఆక్షేపణలు వ్యక్తమవుతుండొచ్చు. కానీ ఇప్పటి ఉరుకులు, పరుగుల జీవితం నుంచి ఈ ధనాధన్ ఆట ఎంతో ఉపశమనం కలిగిస్తోందనేది ఈ క్రికెట్‌ను ఆస్వాదించేవారి వాదన. క్రికెట్ ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెట్టే ఈ ఆటలో ప్రపంచ కప్ అంటే ఎంతో ప్రతిష్ఠాత్మకం. అలాంటి మెగా టోర్నమెంట్ టైటిల్‌ను ముద్దాడడం ఏ జట్టుకైనా జీవితకాల స్వప్నం. అయితే ఈ వరల్డ్ కప్‌లో లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు ప్రతి మ్యాచూ సమరమే. ఇంతటి పోటీ ఉండే ప్రపంచ కప్‌ను టీమిండియా ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా మూడుసార్లు అందుకుంది. ఇదో చరిత్ర అయితే. వరుసగా రెండుసార్లు విశ్వవిజేతగా నిలవడం మరో చరిత్ర. డిఫెండింగ్ చాంపియన్‌గా ఈసారి వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో భారత్ బరిలో దిగింది. టైటిల్ రేసులో సూర్యకుమార్ సేనను క్రికెట్ పండితులు తిరుగులేని ఫేవరెట్‌గా భావించారు. అమెరికాతో ఆరంభ మ్యాచ్, సూపర్-8లో దక్షిణాఫ్రికాతో పోరు మినహా టోర్నమెంట్‌లో టీమిండియా పయనం ఆశించిన విధంగానే సాగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సమరాన్ని ఏకపక్షం నెగ్గారు. సఫారీలతో మ్యాచ్ ఒకవిధంగా భారత్‌కు మేలు చేసిందనే చెప్పాలి. జట్టు కూర్పును సవరించుకొనేందుకు ఆ పోటీ దోహదం చేసింది. ఇక ఆ తర్వాత భారత్‌కు ఎదురులేక పోయింది. సెమీఫైనల్లో..హాట్ ఫేవరెట్ దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్ తుదిపోరులో భారత్ ధాటికి విలవిల్లాడింది. ఇక..టోర్నమెంట్‌లో టీమిండియా ప్రదర్శనను వేనోళ్ల పొగడాలి. ముఖ్యంగా సూపర్-8 దశలో జట్టులో చోటు దక్కించుకున్న వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు లభించిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టిన సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు వరల్డ్ చాంపియన్‌గా నిలవడంతో తన పాత్రను అత్యంత సమర్థంగా పోషించాడు. ఇషాన్ కిషన్, హార్దిక్, తిలక్‌వర్మ, దూబే బ్యాటర్లుగా తమ కర్తవ్యాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు. వరుస డకౌట్లతో విమర్శలు ఎదుర్కొన్నా..కీలక ఫైనల్లో మెరుపు హాఫ్ సెంచరీతో అభిషేక్ మురిపించాడు. బౌలింగ్ విభాగమే ఆశించిన మేర సత్తా చాటలేకపోయింది. కానీ పేస్ దళపతి బుమ్రా కీలకమైన సమయాల్లో బంతి పట్టిన ప్రతిసారి వికెట్ల వేట కొనసాగించి ఆపద్బాంధవుడయ్యాడు. తుదిపోరులో అతడి బౌలింగ్ మరోస్థాయికి చేరింది. హార్దిక్ బౌలర్‌గానూ తానేంటో నిరూపించుకున్నాడు. మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, పేసర్ అర్ష్‌దీప్ నిరాశ పరిచారు. 2024 టీ20 ప్రపంచ కప్ టైటిల్ ఫైట్‌లో బ్యాటుతో కీలకమైన ఇన్నింగ్స్ (47) ఆడి రక్షించిన మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్..ఈసారి ఫైనల్లో బౌలింగ్ (3/27)తో అండగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించి టీమిండియాను మరోసారి జగజ్జేతగా నిలిపాడు.
భళా..భారత్!
1
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (98) నమోదు చేసిన జోడీగా శాంసన్-అభిషేక్. అలాగే ఫైనల్స్‌లో భారత్‌దే అత్యధిక స్కోరు (255/5).
1
మూడు టీ20 ప్రపంచక్‌పలు సాధించిన ఏకైక జట్టుగా టీమిండియా ఈ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో వేగంగా (7.2 ఓవర్లలో) 100 రన్స్ సాధించిన జట్టుగా భారత్.
1
తాజా టోర్నీలో ఫాస్టెస్ట్ (18 బంతుల్లో) ఫిఫ్టీ పూర్తి చేసిన అభిషేక్. అలాగే ఓవరాల్‌గా నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ అతడిదే రికార్డు.
1
ఈ మెగా టోర్నీ చరిత్రలో ఏ జట్టు తరఫునైనా టాప్-3 బ్యాటర్లు (భారత్) హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.
1
ఈ మెగా టోర్నీ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధికంగా పరుగులు (92) సాధించిన జట్టుగా విండీస్ (2024లో అఫ్ఘాన్‌పై)తో సమంగా నిలిచిన భారత్.
1
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఎక్కువ వికెట్లు (40) తీసిన భారత బౌలర్‌గా బుమ్రా. అర్ష్‌దీప్ (36)ను అధిగమించాడు.
2
తొలి పది ఓవర్లలో రెండో అత్యధిక స్కోరు (127) సాధించిన జట్టుగా భారత్. నెదర్లాండ్స్ (2014లో 132) ముందుంది.
3
టోర్నీ సెమీస్, ఫైనల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా శాంసన్. గతంలో అఫ్రీది (2009), విరాట్ (2014) ఉన్నారు.
ఈ వరల్డ్‌కప్ రికార్డులు
అత్యధిక పరుగులు 383
సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్)
అత్యధిక వ్యక్తిగత స్కోరు 110
యువరాజ్ శర్మ (కెనడా)
అత్యధిక వికెట్లు 14
జస్‌ప్రీత్ బుమ్రా (భారత్)
ఫాస్టెస్ట్ సెంచరీ 33 బంతుల్లో
ఫిన్ అలెన్ (న్యూజిలాండ్)
అత్యధిక సెంచరీలు 2
సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్)
అత్యధిక హాఫ్ సెంచరీలు 4
టిమ్ సైఫర్ట్ (న్యూజిలాండ్)
అత్యధిక సిక్సర్లు 24
సంజూ శాంసన్ (భారత్)
అత్యధిక ఫోర్లు 37
సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్)
బెస్ట్ బౌలింగ్ 5/20
రొమారియో షెఫర్డ్ (వెస్టిండీస్)
ఈ టోర్నీలో జట్ల అత్యధిక స్కోర్లు
భారత్ 256 /4 (జింబాబ్వేపై)
భారత్ 255/5 (న్యూజిలాండ్‌పై)
వెస్టిండీస్ 254/6 (జింబాబ్వేపై)
భారత్ 253/7 (ఇంగ్లండ్‌పై)
ఇంగ్లండ్ 246/7 (భారత్‌పై)
నీలం
రంగేసినట్టు..
అభిమానులు పోటెత్తడంతో.. అహ్మదాబాద్‌లో పండగ వాతావరణాన్ని మించిపోయింది. స్టేడియం మొత్తం నీలం రంగు పులుముకోవడంతోపాటు ‘జీతేగా భయ్ జీతేగా.. భారత్ వరల్డ్‌కప్ జీతేగా’ నినాదాలతో మార్మోగించింది. మైదానంలో ఎక్కడ చూసినా భారత జెండాలే రెపరెపలాడాయి. సంజూ, వరుణ్ చక్రవర్తి కోసం కేరళ నుంచి ప్రత్యేకంగా కొందరు వచ్చారు. టీమిండియా జెర్సీలు, టీషర్ట్‌లు, క్యాప్‌లు, త్రివర్ణాలను కొనుగోలు చేయడానికి ఫ్యాన్స్ కూ కట్టారు.
అర్ష్‌దీప్ అతి..
అర్ష్‌దీప్ కొంత అతి చేశాడు. 11వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన అర్ష్‌దీప్.. అనవసరంగా మిచెల్ మీదకు బంతికి విసిరి కవ్వించే ప్రయత్నం చేశాడు. అప్పటికే రెండు సిక్స్‌లు బాదడంతో గుర్రుగా ఉన్న అర్ష్‌దీప్.. ఓ బంతిని ఫీల్డింగ్ చేసి మిచెల్‌పైకి విసిరాడు. మిచెల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయగా.. సూర్య కలగజేసుకొని శాంతింపజేశాడు.
ఇషాన్ సూపర్ క్యాచ్..
ఇషాన్ మూడు క్యాచ్‌లతో అదరగొట్టాడు. అయితే, బుమ్రా బౌలింగ్‌లో రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ను ముందుకు డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. అక్షర్ బౌలింగ్‌లో సైఫర్ట్‌ను కూడా సూపర్ క్యాచ్‌తో కిషన్ వెనక్కిపంపాడు.
1
ఒకే ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు (321)
సాధించిన బ్యాటర్‌గా శాంసన్.
1
బుమ్రాకు నాలుగు వికెట్లు
అత్యధిక పరుగుల ఓవర్లు
భారత్ ఇన్నింగ్స్
ఓవర్ రన్స్
3 15
4 24
5 21
6 20
12 24
14 20
20 24
కివీస్ ఇన్నింగ్స్
ఓవర్ రన్స్
2 21
7 16
11 15
12 16
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
ఇవి కూడా చదవండి:
254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్
అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..