254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్
ABN , Publish Date - Mar 08 , 2026 | 02:39 PM
క్రికెట్‌లో అరుదైన ఘటనలు చాలానే జరుగుతుంటాయి. కానీ అద్భుతాలు మాత్రం చాలా తక్కువగా చోటుచేసుకుంటాయి. 254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తాజాగా న్యూజిలాండ్ పేసర్ బ్రెట్ రాండెల్ సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్‌లో అరుదైన ఘటనలు చాలానే జరుగుతుంటాయి. కానీ అద్భుతాలు మాత్రం చాలా తక్కువగా ఆవిష్కృతమవుతాయి. 254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తాజాగా న్యూజిలాండ్ పేసర్ బ్రెట్ రాండెల్ సాధించాడు. అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పెను సంచలనం నమోదు చేశాడు. న్యూజిలాండ్‌లోని ప్లంకెట్ షీల్డ్ టోర్నీలో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తరఫున ఆడుతున్న బ్రెట్ రాండెల్(Brett Randell).. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశాడు. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్‌ను సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
నార్తర్న డిస్ట్రిక్ట్స్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో రాండెల్.. తన ఓవర్ చివరి బంతికి వికెట్ తీసి.. ఆ తర్వాత వేసిన మరో ఓవర్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించాడు. దీంతో వరుస ఐదు బంతుల్లో ఐదు వికెట్లు(5 wickets in 5 balls) తీసిన ఫస్ట్ క్లాస్ బౌలర్‌గా నిలిచాడు. అలానే వరుసగా ఎనిమిది బంతుల్లో ఆరు వికెట్లు తీసి మరో రికార్డు సృష్టించాడు. మొత్తంగా 11 ఓవర్లలో 25 పరుగులకు 7 వికెట్లు తీసి తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. రాండెల్ ధాటికి నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే ఆలౌటైంది.
ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన ఉదంతాలు గతంలో ఉన్నాయి. అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో నమోదు కావడం మాత్రం ఇదే తొలిసారి. 2021లో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ క్యాంఫర్ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. 2024లో జింబాబ్వే మహిళా క్రికెటర్ కెలిస్ అండర్-19 మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశారు. కాగా, తాజా ఉదంతంలో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసి రికార్డ్ సృష్టించిన రాండెల్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే ఛాన్స్ అనుకోకుండా వచ్చింది. సీనియర్ బౌలర్లు గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో రాండెల్ తుది జట్టులో స్థానం సంపాదించాడు. ఈ అవకాశంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.
ఇవి కూడా చదవండి:
అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..
టీ-20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై ఒక్కసారీ గెలవని టీమిండియా..