మా తర్వాత లక్ష్యం ఆ మెడల్ గెలవడమే: సూర్య కుమార్
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:25 PM
టీ20 ప్రపంచకప్ 2026ను భారత జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026ను భారత జట్టు (Team India) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న (ఆదివారం)అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కీలక వ్యాఖ్యలు చేశాడు. వారి తర్వాతి టార్గెట్ ఏంటో వివరించాడు. ‘మా తర్వాతి లక్ష్యం ఒలింపిక్స్‌లోబంగారు పతకం గెలవడం. అలాగే 2028లో జరిగే టీ20 వరల్డ్ కప్ గెలవడం’ అని సూర్యకుమార్ అన్నాడు.
128 ఏళ్ల తర్వాత
దాదాపు 128 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. లాస్‌ఏంజిలెస్‌లో 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో(Olympics cricket) టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. విజేతగా నిలిచిన జట్టు బంగారు పతకం బహుమతిగా అందుకుంటుంది. ఇలా 128 ఏళ్ల తర్వాత ఒలిపింక్స్ లో క్రికెట్ ఉండటంతో.. తొలి టైటిల్ గెలవడమే తమ లక్ష్యమని టీమిండియా టీ 20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ స్పష్టం చేశాడు.
ఇక టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత సూర్య ఎమోషనల్ అయ్యాడు. మైదానంలోని మట్టిని తీసుకుని తలకు రాసుకున్నాడు. అలానే ట్రోఫీతో మైదానంలో కాసేపు కూర్చున్నాడు. టీ20 వరల్డ్ కప్ అందుకున్న మూడో టీమిండియా కెప్టెన్ గా సూర్య నిలిచాడు. అంతకు ముందు మహేంద్ర సింగ్ ధోని(2007), రోహిత్ శర్మ(2024) ఈ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు క్రికెట్‌కు సంబంధించి ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ఆయా దేశాల జట్లకు అర్హత ప్రమాణాలు ఏంటో ఇంకా ఖరారు కాలేదు. ఆతిథ్య దేశంగా అమెరికా నేరుగా అర్హత సాధిస్తుందని సమాచారం.
ఇవి కూడా చదవండి:
మా ఓటమికి అదే ప్రధాన కారణం: శాంటర్న్
టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్