కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:34 PM
భారత టీ20 జట్టుకు గొప్ప సారథిగా ఎన్నో విజయాలందించిన సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తనను తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ అప్పగించడంతో తొలిసారి స్పందించాడు సూర్య. ఏమన్నాడంటే.?
ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 జట్టుకు గొప్ప సారథిగా ఎన్నో విజయాలందించిన సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో అతడికి మొండిచేయి చూపింది బీసీసీఐ. కెప్టెన్సీ బాధ్యతలను కూడా శ్రేయస్ అయ్యర్‌కు అప్పగిస్తూ సూర్యకుమార్‌కు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ తొలిసారిగా స్పందించాడు.
జట్టు ఎంపిక అనంతరం తన ఇన్‌స్టా స్టోరీలో టీమ్ఇండియా వివరాలను పంచుకున్న స్కై.. 'ఈ ప్రతిభావంతమైన జట్టుకు రాబోయే సవాళ్లలో విజయాలు కలగాలి' అని శుభాకాంక్షలు తెలియజేశాడు. తనకు ఎదురైన నిరాశను పక్కనబెట్టి జట్టుకు మద్దతు తెలపడం అభిమానుల ప్రశంసలందుకుంటోంది.
సూర్యకుమార్ నాయకత్వంలో భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో తొలిసారి పగ్గాలు అందుకున్న అతడు.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం పూర్తిస్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టాడు. అతడి సారథ్యంలో భారత్ 52 మ్యాచ్‌లు ఆడి 42 విజయాలు సాధించింది. 2025 ఆసియా కప్ సహా ఈ ఏడాది స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌నూ గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
అయితే.. కెప్టెన్‌గా విజయవంతమైన సూర్య.. రెండేళ్లుగా బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోతున్నాడు. ఇటీవల ఐపీఎల్‌లోనూ అతడి ప్రదర్శన నిరాశాజనకంగానే సాగింది. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు పడినట్లు తెలుస్తోంది. దీంతో భారత టీ20 జట్టులో సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యానికి తాత్కాలిక విరామం పడినట్టైంది.
ఇవీ చదవండి:
అతడో గేమ్ ఛేంజర్.. వైభవ్ సూర్యవంశీ ఎంపికపై బీసీసీఐ తొలి స్పందనిదే..
అఫ్గాన్ బౌలర్లపై భారత్ ఆధిపత్యం.. రాహుల్ క్లాస్ సెంచరీ