Share News

సూపర్-8 'ప్రీ సీడింగ్' విధానంపై తొలిసారి స్పందించిన సూర్య..

ABN , Publish Date - Feb 22 , 2026 | 02:51 PM

టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా సూపర్‌-8 సమరం నేటి నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సూపర్‌ 8 ‘ప్రీ సీడింగ్‌’ విధానంపై భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తొలిసారి స్పందించారు..

సూపర్-8 'ప్రీ సీడింగ్' విధానంపై తొలిసారి స్పందించిన సూర్య..
Suryakumar Yadav

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2026) సూపర్-8కి సంబంధించి ప్రీ సీడింగ్ విధానంపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ విధానం కారణంగా గ్రూప్ స్టేజ్‪లో టాపర్లుగా నిలిచిన జట్లకు అన్యాయం జరుగుతుందని క్రీడా నిపుణులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రీ సీడింగ్ విధానంపై ఇప్పటికే ఐసీసీ కూడా స్పందించింది. ప్లేయర్ల ప్రయాణాలు, ఇతర అంశాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ విధానాన్ని అనుసరించినట్లు తెలిపింది. అయితే తాజాగా ప్రీ సీడింగ్ విధానంపై టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తొలిసారి స్పందించాడు.


సూపర్‌-8 మ్యాచ్‌ నేపథ్యంలో ‘ప్రీ సీడింగ్‌’ విధానంపై సూర్య(Surya Kumar Yadav) మాట్లాడుతూ.. ‘ ప్రీ సీడింగ్‌ విధానం గురించి నాకు తెలియదు. అలానే దీన్ని ఎవరు చేస్తారో కూడా నాకు తెలియదు. ఒకవేళ నేను ఆ స్థానంలో ఉంటే.. కచ్చితంగా సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తా. గతంలో కూడా నేను ఇదే చెప్పా’ అని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో మైదానాలకు అలవాటు పడటం గురించి మాట్లాడుతూ.. 'ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడుతుండటంతో వేదికలకు అలవాటు పడే విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. ఐపీఎల్‌లో ఎవరు పాల్గొన్నా.. అన్ని వేదికల్లో ఆడారు' అని తెలిపాడు. ఇక అభిషేక్ శర్మ హ్యాట్రిక్ డక్స్ గురించి మీడియా ప్రశ్నించగా.. అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన చెందుతున్న వారి గురించి తాను ఆందోళన చెందుతున్నానంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు.


ప్రీ సీడింగ్‌ విధానంపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) కూడా స్పందించాడు. ప్రీ సీడింగ్‌పై ఇప్పుడే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించాడు. ఈ మెగా టోర్నమెంట్‌ ప్రారంభానికి ముందు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు లేవనెత్తలేదని, ఇప్పుడే ఎందుకు ప్రస్తావిస్తున్నారు..? అని ప్రశ్నించాడు. అలానే ఐసీసీ దీనిని బాగా వివరించగలదని, రెండు దేశాల్లో టోర్నీ నిర్వహించడం.. మ్యాచ్‌ల షెడ్యూల్‌.. ఆటగాళ్ల ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నానని గావస్కర్‌ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్

Updated Date - Feb 22 , 2026 | 03:17 PM