Share News

ఐపీఎల్2026: ఆదుకున్న నితీశ్, క్లాసెన్.. ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 156

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:19 PM

సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్.. అభిమానులను నిరాశపర్చింది. ఇవాళ ఉప్పల్ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఎస్ఆర్‌హెచ్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

ఐపీఎల్2026: ఆదుకున్న నితీశ్, క్లాసెన్.. ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 156
SRH Score 156

స్పోర్ట్స్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్.. అభిమానులను నిరాశపర్చింది. ఇవాళ(ఆదివారం) ఉప్పల్ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఎస్ఆర్‌హెచ్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసేన్(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) రాణించడంతో కనీసం ఆ స్కోర్ అయినా చేయగలిగింది. ఎల్ఎస్‪జీ బౌలర్లలో మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు సాధించగా.. మనిమారన్ సిద్ధార్థ్, దిగ్వేశ్ సింగ్ రాఠీ చెరో వికెట్ సాధించారు.


లఖ్‪నవూ పేసర్ మహ్మద్ షమీ దెబ్బకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. అభిషేక్ డకౌట్ కాగా.. హెడ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్(1) సైతం విఫలమయ్యాడు. లివింగ్ స్టోన్(14) కాసేపు నిలబడినా.. పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడ్డాడు. చివరకు 26 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఏడు ఓవర్లకు కేవలం 26 పరుగులతో ఎస్ఆర్ హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్లాసెన్(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) జోడి జట్టును ఆదుకుంది.


వీరిద్దరు ఐదో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మనిమారన్ సిద్ధార్ధ్ 142 పరుగుల వద్ద నితీశ్ రెడ్డిని ఔట్ చేసి.. ఆ జోడిని విడతీశాడు. కాసేపటికే క్లాసెన్, హర్ష్ దూబె లను వరుస బంతుల్లో ఆవేశ్ ఖాన్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన టెయిలెండర్లు లఖ్‌నవూ బౌలర్ల దెబ్బకు పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో 9 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్ 156 పరుగులు చేసింది.


ఇవి కూడా చదవండి:

టాస్ నెగ్గిన లఖ్‌నవూ.. బ్యాటింగ్ ఎవరిదంటే..

సెహ్వాగ్-గంభీర్‌లనే వెనక్కి నెట్టిన వైభవ్!

Updated Date - Apr 05 , 2026 | 06:08 PM