Share News

ఆ ఒక్క మాటతోనే వికెట్లు తీశారు: సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:22 PM

సన్‌ రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్‌లపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ యువ బౌలర్లు వచ్చిన నేపథ్యం చూస్తే.. వారు సాధించినది చాలా గొప్ప విజయమని కొనియాడాడు.

ఆ ఒక్క మాటతోనే వికెట్లు తీశారు: సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్
Varun Aaron Sunrisers Hyderabad

స్పోర్ట్స్ డెస్క్: ప్రస్తుతం సన్‌ రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్‌ పేర్లు మార్మోగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో ఒక్క మ్యాచ్ వీరిద్దరి స్వరూపాన్నే మార్చేసింది. తమ బౌలింగ్ దళం పటిష్ఠంగా లేదని బాధపడుతున్న ఆరెంజ్ అభిమానులకు హింగే, హుస్సేన్ రూపంలో మెరుపులాంటి కుర్రాళ్లు దొరికారు. వీరిద్దరిపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ యువ బౌలర్లు వచ్చిన నేపథ్యం చూస్తే.. వారు సాధించినది చాలా గొప్ప విషయమని కొనియాడాడు.


రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సన్‌ రైజర్స్ నయా పేసర్లు ప్రఫుల్ హింగే(4/34), సాకిబ్ హుస్సేన్(4/24) అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ప్రఫుల్ హింగే.. రాజస్థాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి సరికొత్త చరిత్రను లిఖించాడు. సాకిబ్ హుస్సేన్ కూడా నాలుగు వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించాడు.


ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న వరుణ్ ఆరోన్ ఈ కుర్రాళ్లను ప్రశంసించాడు. ఈ యువ పేసర్లతో తాను రచించిన బౌలింగ్ వ్యూహం గురించి వివరించాడు. 'ఫలితం గురించి ఆలోచించకుండా అరంగేట్ర మ్యాచ్‌ను ఆస్వాదించాలని కుర్రాళ్లకు చెప్పాను. ఆ మాట బాగా పనిచేసింది. ఏ ఫార్మాట్‌లోనైనా మీరు ఒక్కసారే అరంగేట్రం చేస్తారు. అందుకే ఈ ఆటను పూర్తిగా ఆస్వాదించండి. ఒకవేళ మీరు ఈ ఆటను ఆస్వాదించకపోతే నాకు చాలా కోపం వస్తుందని చెప్పాను. వారు నిజంగానే ఆటను ఆస్వాదించారు. హింగే, హుస్సేన్ బౌలింగ్‌ను నేను కూడా ఎంజాయ్ చేశాను' అని ఆరోన్‌ తెలిపాడు.


'వైభవ్ సూర్యవంశీని తొలి బంతికే ఔట్ చేస్తానని ప్రఫుల్ హింగే నాతో అన్నాడు. అన్నట్లుగానే వైభవ్‌ను గోల్డెన్ డకౌట్ చేసి మాట నిలబెట్టుకున్నాడు. అయితే అతడిని ఔట్ చేసేందుకు మేం ప్రత్యేక వ్యూహం రచించాం. 'ఓవర్ ది వికెట్' బౌలింగ్ చేస్తే..కచ్చితంగా వికెట్ తీస్తావని చెప్పాను. చివరకు అనుకున్నదే అయ్యింది. వైభవ్ వికెట్ విషయంలో ప్రఫుల్ చాలా ఆత్మవిశ్వాసంగా ఉన్నాడు. అదే అతనికి విజయాన్ని అందించింది' అని వరుణ్ ఆరోన్‌ చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

సోషల్ మీడియా ఉప్పెన.. గంటల్లోనే 3 వేల నుంచి 3 లక్షల ఫాలోవర్స్

కోహ్లీ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదు: మాజీ క్రికెటర్

Updated Date - Apr 14 , 2026 | 05:47 PM