కోహ్లీ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదు: మాజీ క్రికెటర్
ABN , Publish Date - Apr 14 , 2026 | 03:59 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచినప్పటికీ కొందరు కోహ్లీపై విమర్శలు చేస్తున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 12) వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబైపై ఆర్సీబీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆర్సీబీ మ్యాచ్ గెలిచినప్పటికీ కొందరు కోహ్లీపై విమర్శలు చేస్తున్నారు. చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఉన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ దాదాపు 60 సగటు,163 స్ట్రైక్ రేట్‌తో 179 పరుగులు చేశాడు. అయినప్పటికీ అతని ప్రదర్శనపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా ఉందని మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ మంచి ఆరంభాన్ని ఇచ్చాడంటూ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ప్రశంసించినప్పటికీ చోప్రా మాత్రం సంతృప్తి చెందలేదు.
ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. 'విరాట్ కోహ్లీ నిజానికి చాలా నెమ్మదిగా పరుగులు చేశాడు. మ్యాచ్ పరంగా చూస్తే.. గెలిచారు కాబట్టి అది పెద్ద విషయమేమీ కాదనిపించింది. కానీ క్రికెట్ కోణం నుంచి చూస్తే, విరాట్ చాలా నెమ్మదైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇలాంటి ప్రదర్శన ప్రస్తుత ఐపీఎల్ పోటీకి సరిపోదు. అలాగే విరాట్ స్థాయికి కూడా ఈ ప్రదర్శన తగినది కాదు. అతడు స్పీడ్ పెంచాలి' అని చోప్రా అన్నాడు.
ఇదే సమయంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. ముంబైపై రజత్ కనబరిచిన ప్రదర్శన చూసి తాను కూడా అబ్బురపడ్డానని తెలిపాడు. అతను కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేసి.. మైదానం నలువైపులా బౌండరీలు కొడుతూ అలరించాడని పేర్కొన్నాడు. ఈ ప్రదర్శన పాటిదార్ జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి సరిపోతుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా సంజు శాంసన్
అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌కు కీలక పదవి