టీ20 ప్రపంచ కప్ 2026: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా సంజు శాంసన్
ABN , Publish Date - Apr 14 , 2026 | 03:35 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు ప్రకటించింది. స్టార్ పేసర్ బుమ్రాను వెనక్కి నెట్టి ఈ అవార్డును సంజు శాంసన్ దక్కించుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా బ్యాడ్ లక్ ప్లేయర్ అంటూ ఎన్నో విమర్శలు చేసినా.. ప్రశాంతంగా తన రోజు కోసం ఎదురుచూశాడు స్టార్ బ్యాటర్ సంజు శాంసన్. టీ20 ప్రపంచ కప్ 2026లో అనూహ్యంగా జట్టులోకి వచ్చి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కీలక మ్యాచుల్లో పుంజుకుని జట్టుకు విజయాలను అందించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా కూడా నిలిచాడు. తాజాగా ఐసీసీ మార్చి నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును ప్రకటించింది. తన అద్భుతమైన ప్రదర్శనలతో ఈ అవార్డును కూడా సంజునే గెలుచుకోవడం విశేషం.
టీమిండియా టీ20 ప్రపంచ కప్‌ను వరుసగా రెండో సారి గెలుచుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో కీలక సమయాల్లో శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ భారత జట్టు విజయానికి పునాది వేశాయి. సూపర్ 8 దశలో వెస్టిండీస్‌పై అమితుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సంజు 50 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ప్రదర్శన అదృష్టంతో కలిసి రాలేదని నిరూపిస్తూ సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 42 బంతుల్లో 89 పరుగులు చేసి మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పాడు. ఇక ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 46 బంతుల్లోనే 89 పరుగులు సాధించి భారత జట్టుకు ఓవరాల్‌గా మూడో టీ20 ప్రపంచ కప్ టైటిల్ అందించాడు. ఈ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు కోసం పోటీపడ్డ టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా, సౌతాఫ్రికా ప్లేయర్ కానూర్‌ను వెనక్కి నెట్టి ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు.
మహిళల విభాగంలో..
మహిళల విభాగంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమెలియా కెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు లభించింది. అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ అద్బుత ప్రదర్శనలు చేస్తూ జట్టుకు విజయాలను అందించిన కెర్‌కు మూడోసారి ఈ అవార్డు దక్కడం విశేషం.
ఇవి కూడా చదవండి:
రాజస్థాన్‌కు యముడయ్యాడు.. ఎవరూ ప్రఫుల్ హింగే!
అరంగేట్రంలోనే సత్తా చాటిన సన్‌రైజర్స్ పేసుగుర్రం.. ఎవరీ సకిబ్ హుస్సేన్