Share News

అరుదైన మైలురాయిని తాకిన శుభ్‌మన్ గిల్

ABN , Publish Date - Aug 23 , 2026 | 01:50 PM

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో కీలక మైలురాయిని తాకాడు. టెస్ట్ క్రికెట్‌లో 3,000 పరుగులు పూర్తి చేశాడు.

అరుదైన మైలురాయిని తాకిన శుభ్‌మన్ గిల్
Shubman Gill

స్పోర్ట్స్ డెస్క్: కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్‌ విరామ సమయానికి 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ 45, కేఎల్‌ రాహుల్‌ 18 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ క్రమంలోనే టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో కీలక మైలురాయిని తాకాడు.


టెస్ట్ క్రికెట్‌లో 3,000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 28వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. 26 ఏళ్ల గిల్ తన 43వ మ్యాచ్‌ 77వ ఇన్నింగ్స్‌లో వేల పరుగుల మార్కును తాకాడు. ఈ ఫార్మాట్‌లో గిల్‌ 43.53 సగటున, 8 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోర్‌ 269గా ఉంది. భారత్‌ తరఫున అత్యంత పిన్న వయసులో ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. గిల్ టెస్ట్‌ల్లో 3,000 పరుగుల మైలురాయిని 26 ఏళ్ల 349 రోజుల వయసులో అందుకున్నాడు.


ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ (23 ఏళ్ల 228 రోజుల) తొలి స్థానంలో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్‌ (26 ఏళ్ల 157 రోజులు), దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ (26 ఏళ్ల 263 రోజులు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ కంటే వారం రోజుల ముందు గిల్ ఈ మైలురాయిని తాకాడు. కపిల్ దేవ్ 26 ఏళ్ల 356 రోజులు వయసులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 36 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 126 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్‌ (28), గిల్‌ (34) క్రీజ్‌లో ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

న్యూయార్క్‌లో భారతీయుడి దారుణ హత్య.. పిజ్జా డెలివరీ చేస్తుండగా..

కొండా సురేఖపైన కుట్ర చేయాల్సిన ఎవరికి అవసరం లేదు: మంత్రి శ్రీహరి

Updated Date - Aug 23 , 2026 | 02:07 PM