Share News

న్యూయార్క్‌లో భారతీయుడి దారుణ హత్య.. పిజ్జా డెలివరీ చేస్తుండగా..

ABN , Publish Date - Aug 23 , 2026 | 01:36 PM

ఉపాధి కోసం అమెరికా వెళ్లిన పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు న్యూయార్క్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. పిజ్జా డెలివరీ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో మృతిచెందాడు.

న్యూయార్క్‌లో భారతీయుడి దారుణ హత్య.. పిజ్జా డెలివరీ చేస్తుండగా..
Gurdeep Singh Passed Away

న్యూఢిల్లీ: ఉపాధి కోసం అమెరికా వెళ్లిన పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు న్యూయార్క్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. పిజ్జా డెలివరీ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో మృతిచెందాడు. అతడిని దోపిడీ యత్నంలో భాగంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పంజాబ్‌లోని యువకుడి స్వగ్రామం జబోవాల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.


గురుదీప్‌ సింగ్‌ 13 ఏళ్ల క్రితం అప్పు చేసి మరీ అమెరికాకు వెళ్లాడు. తల్లిదండ్రులకు మెరుగైన భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో అక్కడే ఉంటూ కష్టపడి పనిచేస్తున్నాడు. అయితే, పిజ్జా డెలివరీ చేస్తుండగా అతడిపై కాల్పులు జరిగాయి. దోపిడీ యత్నంలో భాగంగానే యువకుడిని హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురుదీప్‌ మృతిచెందిన వార్త తెలియగానే పంజాబ్‌లోని జబోవాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కుమారుడి మృతితో తండ్రి ప్యారా లాల్‌ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా నిలవాల్సిన యువకుడు ఇలా అర్ధాంతరంగా మృతిచెందడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


అమెరికా వెళ్లిన తొలినాళ్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. కుటుంబాన్ని ఆదుకునేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా పని చేసేవాడని ప్యారా లాల్ తెలిపారు. గురుదీప్‌ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. అలాగే కాల్పులకు పాల్పడిన నిందితుడిని త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అమెరికా అధికారులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బిహార్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఆరు నెలల చిన్నారి సహా ముగ్గురు సజీవ దహనం..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 23 , 2026 | 01:36 PM