టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!
ABN , Publish Date - May 08 , 2026 | 01:02 PM
భారత టీ20 జట్టు కెప్టెన్సీలో మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు సూర్యకుమార్ యాదవ్ నుంచి శ్రేయస్ అయ్యర్‌కు బదిలికానున్నట్లు సమాచారం.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్సీలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ బాధ్యతలు సూర్యకుమార్ యాదవ్ నుంచి శ్రేయస్ అయ్యర్‌కు బదిలికానున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026 తర్వాత అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌కు మెసేజ్ కూడా పంపినట్లు తెలుస్తోంది.
సూర్యకుమార్ నేతృత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026ను గెలిచినప్పటికీ, ఇటీవల పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్న అతడిని సారథిగా తప్పించాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ‘స్కై’ ఫామ్‌లోకి వస్తాడని కొంతకాలంగా వేచిచూస్తున్నప్పటికీ అతడి ఆటతీరులో మార్పు రాకపోవడంపై ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌లో 333 పరుగులు సాధించి 47.57 సగటు, 164.04 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు.
దీంతో అయ్యర్‌ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకుని కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. అప్పుడే శ్రేయస్ కెప్టెన్సీపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా వన్డేలు, టీ20లు రెండింటికీ ఒకే కెప్టెన్ ఉండాలని బోర్డు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. శ్రేయస్‌కు గతంలో భారత టెస్ట్, వన్‌డే జట్లకు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. మ్యాచ్ సమయంలో అతడు సహనంగా, ప్రశాంతంగా ఉండే విధానం, పరిణితితో కూడిన నిర్ణయాలు భారత టీ20 జట్టుకు కావాల్సిన లక్షణాలుగా పరిగణించబడుతున్నాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
లఖ్‌నవూ చేతిలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్
హనీ ట్రాప్ ఉచ్చులో పడకండి.. బీసీసీఐ కీలక ఆదేశాలు