Share News

లఖ్‌నవూ చేతిలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్

ABN , Publish Date - May 08 , 2026 | 12:10 PM

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ డీఆర్ఎస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. మిచెల్ మార్ష్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించాడని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు.

లఖ్‌నవూ చేతిలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్
Rajat Patidar reaction

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ డీఆర్ఎస్ విధానంలో 9 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. లఖ్‌నవూ ఓపెనర్ మిచెల్ మార్ష్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించాడని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. మిచెల్ మార్ష్‌ను అడ్డుకునే విషయంలో తాను అయోమయానికి గురయ్యానని వెల్లడించాడు.


ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఓటమిపై రజత్ పాటిదార్ స్పందిస్తూ... 'లక్ష్యాన్ని ఎలా ఛేదించాలనే విషయంలో మాకు స్పష్టమైన వ్యూహం ఉంది. మేం ఈ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లిన విధానం బాగుంది. కేవలం ఒకటి రెండు షాట్లతో విజయాన్ని చేజార్చుకున్నాం. ఓటమికి కారణాలు మ్యాచ్ ముగిసిన వెంటనే విశ్లేషించడం కష్టం. దీని గురించి ఆలోచించడానికి మాకు కొంత సమయం కావాలి. మాకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నాం' అని తెలిపాడు.


'లఖ్‌నవూ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఆడిన ఆట తీరు అద్భుతం. పవర్‌ప్లేలో అతను మమ్మల్ని చాలా ఒత్తిడిలోకి నెట్టాడు. చివరకు మార్ష్‌కు ఎవరితో బౌలింగ్ చేయించాలనే సందేహానికి నేను లోనయ్యాను. అతను ఆడిన విధానం నిజంగా ఒక అసాధారణమైన ఇన్నింగ్స్. మా బ్యాటర్లందరూ చాలా బాగా ఆడారు. ప్రస్తుతం జట్టులో అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

హనీ ట్రాప్ ఉచ్చులో పడకండి.. బీసీసీఐ కీలక ఆదేశాలు

పంత్ రికార్డును బద్దలు కొట్టిన మార్ష్

Updated Date - May 08 , 2026 | 12:50 PM