శ్రీలంక ఓటమి.. జయసూర్య సంచలన నిర్ణయం..
ABN , Publish Date - Mar 01 , 2026 | 10:45 AM
పొట్టి ప్రపంచ కప్ నుంచి శ్రీలంక జట్టు ఓటమితో తప్పుకున్న సంగతి తెలిసిందే. నిన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆ జట్టు కోచ్, దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) టోర్నీలో ఓటమితో శ్రీలంక ప్రస్థానం ముగిసింది. నిన్న(శనివారం) పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది. అయితే సొంతగడ్డపై టోర్నీ జరగుతున్నా కనీసం సెమీ ఫైనల్‌కు కూడా చేరలేకపోవడంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో లంక క్రికెట్‌లో పెను భూకంపం సంభవించింది. జట్టు హెడ్ కోచ్, దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్ చేతిలో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జయసూర్య(Sanath Jayasuriya) మాట్లాడుతూ.. 'శ్రీలంక జట్టు కోచ్ గా నా కాంట్రాక్ట్ జూన్ 2026 వరకు ఉన్నప్పటికీ, దానిని కొనసాగించే ఉద్దేశం లేదు. జట్టు బాధ్యతలను మరొకరికి అప్పగించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను' అని తెలిపాడు. వరల్డ్ కప్ 2026లో శ్రీలంక జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తప్పుకున్నారని సమాచారం. అయితే మార్చి 13 నుంచి షార్జాలో ఆఫ్గానిస్థాన్‌తో జరిగే సిరీస్‌లో మాత్రం ఆయన జట్టుతో కలిసి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జయసూర్య రాజీనామా ప్రకటన శ్రీలంక క్రికెట్ బోర్డుకు ముందస్తు సమాచారం లేకుండానే వెలువడటం ఇక్కడ కొస మెరుపు.
వాస్తవానికి జయసూర్య కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో శ్రీలంక జట్టు అద్భుత విజయాలను అందుకుంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆయన శ్రీలంక కోచ్‌గా పగ్గాలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలోని లంక జట్టు ఆగస్టులో టీమిండియాపై 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలిచింది. అలాగే ఇంగ్లాండ్‌లో ఓవల్ టెస్టు గెలవడం, న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేయడం వంటి విజయాలతో లంక క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అందరూ భావించారు. కానీ ఈ టీ20 వరల్డ్ కప్‌లో స్వదేశీ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో జట్టు విఫలమైంది. కీలక మ్యాచ్‌లలో తడబడటం సెమీస్ అవకాశాలను దెబ్బతీసింది. శ్రీలంక క్రికెట్ బోర్డు(Sri Lanka Cricket Board) ఇప్పుడు కొత్త కోచ్ కోసం వేట ప్రారంభించాల్సి ఉంది. మొత్తంగా జయసూర్య వంటి దిగ్గజం తప్పుకోవడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
'రంజీ' విజేతగా జమ్ముకశ్మీర్.. స్ఫూర్తిదాయక విజయంతో నయా చరిత్ర