Share News

గెలిచినా.. పాక్‌ ఇంటికే

ABN , Publish Date - Mar 01 , 2026 | 05:17 AM

టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ కథ ముగిసింది.. న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరుకొంది. సూపర్‌-8లో భాగంగా గ్రూప్‌-2లో శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో పాక్‌ 5 పరుగులతో శ్రీలంకపై గెలిచింది.

గెలిచినా.. పాక్‌ ఇంటికే

  • పోరాడి ఓడిన శ్రీలంక

  • భయపెట్టిన షనక

  • సెమీస్‌కు న్యూజిలాండ్‌

పల్లెకెలె: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ కథ ముగిసింది.. న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరుకొంది. సూపర్‌-8లో భాగంగా గ్రూప్‌-2లో శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో పాక్‌ 5 పరుగులతో శ్రీలంకపై గెలిచింది. పాక్‌ నాకౌట్‌ చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపుతోపాటు కివీస్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ సాధించాలి. ఈ క్రమంలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 20 ఓవర్లలో 212/8 స్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాహిబ్జాదా ఫర్హాన్‌ (60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100) సెంచరీ చేయగా.. ఫఖర్‌ జమాన్‌ (84) రాణించాడు. మదుశంక 3, షనక 2 వికెట్లు పడగొట్టారు. అయితే, సెమీస్‌ బెర్త్‌ను సొంతం చేసుకోవాలంటే లంకను 147, అంతకంటే తక్కువ పరుగులకే కట్టడి చేయాల్సిన పరిస్థితి.

కానీ, కెప్టెన్‌ షనక (31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 నాటౌట్‌), పవన్‌ రత్నాయకె (58) అర్ధ శతకాలతో పోరాడడంతో.. ఛేదనలో లంక ఓవర్లన్నీ ఆడి 207/6 స్కోరు మాత్రమే చేయగలిగింది. మిషార (26), అసలంక (25) రాణించారు. విజయానికి చివరి ఓవర్‌లో 28 రన్స్‌ కావాల్సి ఉండగా.. షనక అద్భుత బ్యాటింగ్‌తో పాక్‌కు ముచ్చెమటలు పట్టించాడు. అఫ్రీది వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్లో ఫోర్‌, మూడు సిక్స్‌లతో 22 పరుగులు రాబట్టాడు. గెలుపునకు 6 రన్స్‌ అవసరమ వగా.. తెలివిగా బంతులేసిన అఫ్రీది.. షనక షాట్లు ఆడకుండా కట్టడి చేశాడు.


ఆఖర్లో ఢమాల్‌..: అంతకుముందు ఓపెనర్లు ఫర్హాన్‌, ఫఖర్‌ తొలి వికెట్‌కు 176 పరుగుల భాగస్వామ్యంతో అదిరే ఆరంభాన్నిచ్చారు. అయితే, డెత్‌ ఓవర్లలో క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టిన లంక.. కొంతమేర ప్రత్యర్థి జోరుకు బ్రేకులేసింది. 15.4 ఓవర్లలో పాక్‌ 176/0తో భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, ఫఖర్‌ను చమీర ఎప్పుడైతే అవుట్‌ చేశాడో.. అప్పటి నుంచి పాక్‌ బ్యాటింగ్‌ పేకమేడలా కూలింది. 26 బంతుల్లో.. 36 రన్స్‌ తేడాతో 8 వికెట్లు కోల్పోయింది. సెంచరీ పూర్తి చేసుకొన్న ఫర్హాన్‌ను ఆఖరి ఓవర్‌లో మదుశంక అవుట్‌ చేశాడు.

సంక్షిప్త స్కోర్లు: పాకిస్థాన్‌: 20 ఓవర్లలో 212/8 (ఫర్హాన్‌ 100, ఫఖర్‌ 84; మదుశంక 3/33, షనక 2/42). శ్రీలంక: 20 ఓవర్లలో 207/6 (షనక 76 నాటౌట్‌, పవన్‌ రత్నాయకె 58; ఎబ్రార్‌ 3/23).

భారత్‌లోనే సెమీఫైనల్స్‌

టీ20 ప్రపంచ కప్‌ నుంచి పాకిస్థాన్‌ జట్టు నిష్క్రమించడంతో సెమీఫైనల్‌ మ్యాచ్‌లు భారత్‌లోనే జరగనున్నాయి. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం.. పాకిస్థాన్‌ లేదా శ్రీలంక జట్లు సెమీస్‌కు చేరితే, తొలి సెమీస్‌ వేదికగా కొలంబోను నిర్ణయించారు. కానీ, ఇప్పుడు ఆ రెండు జట్లు సూపర్‌-8లోనే నిష్క్రమించడంతో.. ఇక రెండు సెమీఫైనల్స్‌ భారత్‌లోనే జరగనున్నాయి. తొలి సెమీస్‌ బుధవారం కోల్‌కతాలో, రెండోది గురువారం ముంబైలో నిర్వహిస్తారు.

Updated Date - Mar 01 , 2026 | 06:53 AM