ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోకి గిల్ సహచరుడు
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:24 PM
భారత ఎడమచేతి స్పిన్నర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి కిషోర్ మరోసారి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. 29 ఏళ్ల ఈ బౌలర్‌తో గ్లోస్టర్‌షైర్ కౌంటీ క్లబ్ 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన ఆటగాడు సాయి కిషోర్‌కి అదిరిపోయే ఛాన్స్ దక్కింది. 29 ఏళ్ల ఎడమచేతి స్పిన్నర్ మరోసారి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ 2026లోని మిగిలిన 6 మ్యాచ్‌ల కోసం ఈ తమిళనాడు బౌలర్‌తో గ్లోస్టర్‌షైర్ కౌంటీ క్లబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఇవాళ గ్లోస్టర్ షైర్ ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది.
గ్లోస్టర్ షైర్ తరఫున సాయి కిషోర్ వోర్సెస్టర్‌షైర్, డర్హమ్, డెర్బీషైర్, లాంకషైర్, మిడిల్‌సెక్స్, కెంట్‌లతో జరిగే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ 2026లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన గ్లోస్టర్ షైర్ కేవలం ఒక విజయం మాత్రమే సాధించి పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో సాయి రాకతో జట్టు స్పిన్ విభాగం బలోపేతం అవుతుందని యాజమాన్యం భావిస్తోంది. కిషోర్ గతంలో 2025లో సర్రే తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో విజయవంతంగా రాణించి, రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డర్హమ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి సత్తాచాటాడు. ఆ అనుభవంతో ఇప్పుడు రెండోసారి ఇంగ్లండ్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
కౌంటీ ఛాంపియన్ షిప్ 2026లో అవకాశం రావడంపై సాయి కిషోర్ స్పందించాడు. 'ఇంగ్లండ్ పరిస్థితుల్లో నా నైపుణ్యాలను పరీక్షించుకోవాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత, ఇదే సరైన ఎంపిక అని నాకు అనిపించింది. జెర్సీ ధరించడానికి, బ్రిస్టల్, చెల్టెన్‌హామ్‌ల్లో అభిమానులను కలవడానికి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను' అని ఒక ప్రకటనలో కిషోర్ తెలిపాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సాయి అద్భుత రికార్డు ఉంది. 54 మ్యాచ్‌ల్లో 223 వికెట్లు పడగొట్టిన అతడు సగటున 24.21 పరుగులకు ఓ వికెట్ పడగొట్టాడు. ఇందులో 14 సార్లు ఐదు వికెట్ల ఘనత అతడి ఖతాలో ఉన్నాయి. 2025-26 రంజీ ట్రోఫీ సీజన్‌లోనూ అతడు నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ జట్టులో సాయి కిషోర్‌కు పెద్దగా అవకాశాలు లభించలేదు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడిన అతడు ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి:
రొనాల్డినోలా జైలుకు పంపుతా.. ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్
ఇప్పటికీ మంచి మిత్రుడే.. కానీ కలవను: యోగరాజ్ వివాదంపై కపిల్ దేవ్