చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ కెప్టెన్.. రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:23 PM
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం రోహిత్ శర్మకు సంబంధించిన మరో ప్రపంచ రికార్డు బద్దలైంది. అది కూడా పసికూన ఐర్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ బ్రేక్ చేయడం గమనార్హం.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అతను సాధించిన కొన్ని రికార్డులను అయితే ఎవరికి అందనంత దూరంలో ఉన్నాయి. మరికొన్ని రికార్డులు మాత్రం బ్రేక్ అవుతున్నాయి. తాజాగా రోహిత్ కు సంబంధించిన మరో ప్రపంచ రికార్డు బద్దలైంది. అది కూడా పసికూన ఐర్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ బ్రేక్ చేయడం గమనార్హం. మరి.. ఆ రికార్డుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు ఐర్లాండ్ జట్టు.. యూఏఈ(UAE) పర్యటనకు వెళ్లింది. గురువారం జరిగిన తొలి మ్యాచులో 57 పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (8) విఫలం కాగా.. రాస్ అడేర్ (39) రాణించాడు. మిగిలిన బ్యాటర్లలో లోర్కాన్ టకర్ (25 బంతుల్లో 38), కర్టిస్ కాంఫర్ (25) ఫర్వాలేదనిపించారు. చివర్లో బెంజమిన్ కలిజ్ ( 26*), జార్జ్ డాక్రేల్ (22*) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆడారు. ఫలితంగా ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 178 పరుగులు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖి, హైదర్ అలీ చెరో రెండు వికెట్లు సాధించారు. ముహమ్మద్ అర్ఫాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో 19.5 ఓవర్లలో 121 పరుగులకే యూఏఈ ఆలౌట్ అయింది. దీంతో ఐర్లాండ్ 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.
ఇదే మ్యాచులో ఐర్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాల్ స్టిర్లింగ్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఇది 160వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. తద్వారా ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(159) (Rohit Sharma) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును స్టిర్లింగ్ బద్దలు కొట్టాడు. 2024లో అంతర్జాతయ టీ20లకు రోహిత్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లు అత్యధికంగా ఆడిన క్రికెటర్లు:
పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్): 2009- 2026*- 160 మ్యాచ్‌లు
రోహిత్ శర్మ ( భారత్): 2007-2024- 159 మ్యాచ్‌లు
జార్జ్ డాక్రేల్ (ఐర్లాండ్): 2010-2026*- 153 మ్యాచ్‌లు
మహ్మద్ నబీ (అఫ్గనిస్థాన్): 2010-2026- 148 మ్యాచ్‌లు
జోస్ బట్లర్ (ఇంగ్లాండ్): 2011-2025- 144 మ్యాచ్‌లు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!
నా రిటైర్మెంట్‌కు కారణం అదే.. యువీ షాకింగ్ కామెంట్స్..