‘ముంబై’ పగ్గాలు మళ్లీ రోహిత్‌కే
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:11 AM
హార్దిక్ పాండ్యా సారథ్యంలో విఫలమైన ముంబై ఇండియన్స్... పాత నాయకుడు రోహిత్ శర్మ (39)నే ఆశ్రయించింది. మరోసారి అతడినే కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు ఫ్రాంచైజీ శుక్రవారం ప్రకటించింది.
ముంబై: హార్దిక్ పాండ్యా సారథ్యంలో విఫలమైన ముంబై ఇండియన్స్... పాత నాయకుడు రోహిత్ శర్మ (39)నే ఆశ్రయించింది. మరోసారి అతడినే కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు ఫ్రాంచైజీ శుక్రవారం ప్రకటించింది. దాంతో 2027 సీజన్ నుంచి హిట్‌మ్యాన్ నేతృత్వంలో ముంబై ఐపీఎల్ బరిలో దిగనుంది. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. కానీ 2024లో రోహిత్‌ను తప్పించి హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచి ముంబై ఇండియన్స్ ఆట పూర్తిగా చతికిలపడింది. ఆ ఏడాది ముంబై 10 జట్ల లీగ్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. దాంతో ముంబై అభిమానులు హార్దిక్ పాండ్యాతోపాటు ఫ్రాంచైజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంజేశారు.
2025లో లీగ్ దశలో నాలుగో స్థానం సాధించిన ఆ జట్టు క్వాలిఫయర్-2తో వెనుదిరిగింది. ఇక ఈ సీజన్‌లో అయితే తొమ్మిదో స్థానంతో ముగించింది. దాంతో హార్దిక్‌ను వదులు కోవాలని ముంబై నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే హార్దిక్‌ను ఈసారి ట్రేడింగ్‌లో పంజాబ్ కింగ్స్ తీసుకున్నది. బదులుగా పంజాబ్ నుంచి పేసర్ అర్ష్‌దీప్ ముంబైకి వెళ్లాడు. 2013లో తొలిసారి ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన రోహిత్‌ను 2023 సీజన్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇక..రోహిత్ సారథ్యంలో 2013, 2015, 2017, 2019, 2020లో ముంబై ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. 2013లో చాంపియన్స్ లీగ్ టీ20 టైటిల్‌ను రోహిత్ కెప్టెన్సీలో ముంబై తన ఖాతాలో వేసుకుంది. హిట్‌మ్యాన్ నాయకత్వంలో 158 మ్యాచ్‌లు ఆడిన ముంబై 87 పోటీలలో గెలుపొందింది.
20వ సీజన్ ఐపీఎల్‌కు, రాబోయే సవాళ్ల కోసం ఎదురు చూస్తున్నా. మా అభిమానులు సంబరపడేలా చేయడమే జట్టు లక్ష్యం. కలిసికట్టుగా మాదైన శైలి క్రికెట్ ఆడి ఆటను ఆస్వాదిస్తాం. నా జీవితంలో ముంబై ఇండియన్స్ ముఖ్యమైన భాగం. ఆ జట్టుకు సారథ్యం వహించడం ఎంతో గర్వకారణం.
- రోహిత్
ఇవి కూడా చదవండి:
అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు
కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్