Share News

జెర్సీ నంబర్ 7 మార్చుకోమన్న న్యూమరాలజిస్ట్.. ధోనీ ఏమన్నాడంటే?

ABN , Publish Date - Nov 29 , 2026 | 06:35 PM

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన జెర్సీ నంబర్ 7 వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. న్యూమరాలజిస్ట్ నంబర్ మార్చుకోవాలని సూచించగా, ధోనీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు.

జెర్సీ నంబర్ 7 మార్చుకోమన్న న్యూమరాలజిస్ట్.. ధోనీ ఏమన్నాడంటే?
MS Dhoni

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి, జెర్సీ నంబర్ 7ను ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నంబర్ ధోనికి పర్యాయపదంగా మారింది. అతడు అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీల్లో రెండు దశాబ్దాలకు పైగా జెర్సీ నంబర్ 7ను ధరించాడు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో 7కి సంబంధించిన ఏదైనా సరే 'తలా ఫర్ ఎ రీజన్' అనే ప్రసిద్ధ పదబంధంతో ధోనీతో ముడిపడి ఉంటుంది. అయితే, తాజాగా తన జెర్సీ నంబర్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని మిస్టర్ కూల్ వెల్లడించాడు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తన జెర్సీ నంబర్‌ను మార్చుకోమని ఒక సంఖ్యాశాస్త్ర నిపుణుడు తనకు సలహా ఇచ్చాడని ధోనీ వెల్లడించాడు.


'నేను టీమిండియాలోకి అరంగేట్రం చేసినప్పుడు, మీకు ఏ నంబర్ కావాలని నన్ను అడిగారు. నేను 1981, జూలై 7న పుట్టాను. అందుకే నేను 'నాకు నంబర్ 7 ఇవ్వండి. ఆ నంబర్‌ను మరెవరూ ఉపయోగించకపోయినా నాకు సంతోషమే' అని చెప్పాను. అది మూఢనమ్మకం వల్ల కాదు. ప్రత్యేక గుర్తు కోసం' అని ధోని అన్నారు.


'నేను విమానంలో ప్రయాణిస్తుండగా.. ఒక సంఖ్యాశాస్త్ర నిపుణుడు నా దగ్గరకు వచ్చాడు. క్రికెట్‌లో మీ ఫామ్ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. నేను నా జెర్సీ నంబర్‌ను మార్చుకుంటే మంచి జరుగుతుంది అని వెల్లడించాడు. 'దీనికి పరిస్కారం ఏమిటి' అని నేను అతడిని అడిగాను. నేను 7 నుంచి 11కి, తర్వాత 11 నుంచి 15కి మారుతాను. కానీ ప్రాథమికంగా నా లోపాలను నా జెర్సీ నంబర్‌పైకి మళ్లిస్తూనే ఉంటాను. 'నేను బాగా ప్రాక్టీస్ చేస్తే, నేను ప్రతిదీ సరిగ్గా చేస్తే, నేను నంబర్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు' అని అతడికి చెప్పాను' అని ధోనీ వెల్లడించాడు. ఒకసారి మూఢ నమ్మకాలకు అలవాటుపడితే, వాటి నుంచి బయటపడటం చాలా కష్టమని ధోని పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

పంచాయతీ ఎన్నికల్లో కూటమి జోరు.. అవమానంతో రెచ్చిపోతున్న వైసీపీ..!

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా.. నిమ్మకూరులో ఘన విజయం

Updated Date - Nov 29 , 2026 | 06:46 PM