Share News

పంచాయతీ ఎన్నికల్లో కూటమి జోరు.. అవమానంతో రెచ్చిపోతున్న వైసీపీ..!

ABN , Publish Date - Nov 29 , 2026 | 06:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో 1,155 పంచాయతీలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోగా.. వైసీపీ మాత్రం 100లకే పరిమితమైంది. అయితే, ఓటమి భయంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైసీపీ విధ్వంస చర్యలకు పాల్పడుతోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో కూటమి జోరు.. అవమానంతో రెచ్చిపోతున్న వైసీపీ..!
TDP vs YSRCP

అమరావతి, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఈరోజు (ఆదివారం) మొత్తం 4,975 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఫలితాల్లో కూటమి అభ్యర్థులే పైచేయి సాధించారు. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో 1,155 పంచాయతీలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోగా.. వైసీపీ మాత్రం 100లకే పరిమితమైంది. అయితే, ఓటమి భయంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైసీపీ విధ్వంస చర్యలకు పాల్పడుతోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. హింస ద్వారా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు.


ఈ మేరకు అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడినట్లు అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో పలువురు టీడీపీ ఏజెంట్లకు గాయాలయ్యాయని చెబుతున్నారు. నంద్యాల జిల్లా ముత్తులూరులోనూ గొడ్డలితో వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం అమలాపురంలో టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై వైసీపీ మూకలు దాడి చేశాయంటూ స్థానిక కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా ముక్తేశ్వరంలో ఆ పార్టీ మూకలు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లినట్లు టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.


ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లులో వైసీపీ కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జిల్లాలోని నాగంబట్లపాలెం పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు, నీళ్లు పోసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, కడప జిల్లాలో తమను రెచ్చగొట్టేలా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని కూటమి నేతలు చెబుతున్నారు. అవినాశ్ రెడ్డి భారీ కాన్వాయ్‌తో గ్రామాల్లో తిరుగుతూ హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటమిని భరించలేకే వైసీపీ నాయకులు, కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడుతున్నారని కూటమి నేతలు ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

పులివెందులలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. మరికాసేపట్లో తేలనున్న అభ్యుర్థుల భవితవ్యం

Updated Date - Nov 29 , 2026 | 06:08 PM