Share News

షమీ సంచలనం.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏకైక బౌలర్

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:30 PM

టీమిండియా ప్లేయర్ మహమ్మద్ షమీ ఐపీఎల్‌లో సంచలనం సృష్టించాడు. తొలి బంతికే 5 సార్లు వికెట్ తీసిన ఏకైక బౌల‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. నిన్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

షమీ సంచలనం.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏకైక బౌలర్
Mohammed Shami record IPL

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా ప్లేయర్ మహమ్మద్ షమీ ఐపీఎల్‌(IPL 2026)లో సంచలనం సృష్టించాడు. తొలి బంతికే 5 సార్లు వికెట్ తీసిన ఏకైక బౌల‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఈ అరుదైన ఘనత అందుకున్న ఏకైక బౌలర్‌గా షమీ నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఎకానా స్టేడియంలో లఖ్‌నవూ సూప‌ర్ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ ఓట‌మి పాలైంది.


ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ త‌రుఫున ఆడుతూ తొలి బంతికే కేఎల్ రాహుల్ వికెట్ తీసిన ష‌మీ(Mohammed Shami) ఈ ఘ‌న‌త సాధించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ తొలి బంతికే కేఎల్ రాహుల్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. షమీ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీయడం ఇది ఐదోసారి. గతంలో ఏడుగురు బౌలర్లు తలో మూడు సార్లు ఈ ఘనతను సాధించారు. కాగా గ‌త సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన ష‌మీని లఖ్‌నవూ సూప‌ర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. నిన్న జరిగిన లఖ్‌నవూ తొలి మ్యాచ్‌లో ష‌మీ త‌న మార్క్‌ను చూపించాడు. నాలుగు ఓవ‌ర్ల కోటాలో 28 ప‌రుగులిచ్చి ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. ష‌మీ 2013లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వ‌ర‌కు అత‌డు 121 మ్యాచ్‌లు ఆడి... 8.62 ఎకాన‌మీతో 134 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్ల ప్రద‌ర్శన ఉంది.


ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే..తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూప‌ర్ జెయింట్స్(Lucknow Super Giants) 18.4 ఓవ‌ర్ల‌లో 141 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంతరం 142 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 17.1 ఓవ‌ర్లలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఛేదించింది. సమీర్ రిజ్వీ (70 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (39 నాటౌట్)లు ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. లఖ్ నవూ బౌల‌ర్లలో ప్రిన్సీ యాద‌వ్ రెండు, మ‌హ్మద్ ష‌మీ, మోసిన్ ఖాన్‌లు చెరో వికెట్ సాధించారు.


ఐపీఎల్‌లో తొలి బంతికే ఎక్కువ సార్లు వికెట్లు తీసిన బౌలర్లు:

  • మహ్మద్ షమీ-5

  • ప్రవీణ్ కుమార్-3

  • ఉమేష్ యాదవ్-3

  • ట్రెంట్ బౌల్ట్-3

  • లసిత్ మలింగ-3

  • భువనేశ్వర్ కుమార్-3

  • అశోక్ దిండా-3

  • పాట్ కమిన్స్-3


ఇవి కూడా చదవండి:

అదరగొట్టిన రిజ్వీ ఢిల్లీ బోణీ

కివీస్‌ మహిళల కొత్త చరిత్ర

Updated Date - Apr 02 , 2026 | 03:29 PM