Share News

అదరగొట్టిన రిజ్వీ ఢిల్లీ బోణీ

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:17 AM

క్లిష్ట పరిస్థితుల్లో సమీర్‌ రిజ్వీ (47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 నాటౌట్‌) మెరుపు అర్ధ శతకంతో ఆదుకోవడంతో.. ఐపీఎల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయంతో ఆరంభించింది....

అదరగొట్టిన రిజ్వీ ఢిల్లీ బోణీ

నేటి మ్యాచ్‌ కోల్‌కతా X సన్‌రైజర్స్‌

వేదిక కోల్‌కతా రా.7.30 నుంచి

6 వికెట్లతో లఖ్‌నవూ చిత్తు

లఖ్‌నవూ: క్లిష్ట పరిస్థితుల్లో సమీర్‌ రిజ్వీ (47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 నాటౌట్‌) మెరుపు అర్ధ శతకంతో ఆదుకోవడంతో.. ఐపీఎల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయంతో ఆరంభించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్లతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎ్‌సజీ)ను ఓడించింది. తొలుత లఖ్‌నవూ 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్‌ సమద్‌ (36), మిచెల్‌ మార్ష్‌ (35) టాప్‌ స్కోరర్లు. నటరాజన్‌, ఎన్‌గిడి చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఢిల్లీ 17.1 ఓవర్లలో 145/4 స్కోరు చేసి గెలిచింది. స్టబ్స్‌ (39 నాటౌట్‌) రాణించాడు. ప్రిన్స్‌ 2 వికెట్లు తీశాడు. సమీర్‌ రిజ్వీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

ఆరంభంలో తడబడినా..: ఛేదనలో ఢిల్లీ 26/4తో కీలక టాపార్డర్‌ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో.. ఇంపాక్ట్‌ సబ్‌గా వచ్చిన రిజ్వీ, స్టబ్స్‌ ఐదో వికెట్‌కు అజేయంగా 119 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీని గెలిపించారు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (0)ను షమి అవుట్‌ చేసి షాకిచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నితీశ్‌ రాణా (15) రెండు ఫోర్లు, సిక్స్‌తో జోరు చూపే ప్రయత్నం చేశాడు. కానీ, 5 పరుగుల తేడాతో మూడు వికెట్లు చేజార్చుకొన్న క్యాపిటల్స్‌ ఒత్తిడిలో పడింది. రాణాను మొహిసిన్‌ క్యాచవుట్‌ చేయగా.. ఐదో ఓవర్‌లో మరో ఓపెనర్‌ నిస్సాంక (1), కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (0)ను ప్రిన్స్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో రిజ్వీ, స్టబ్స్‌ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. నోకియా బౌలింగ్‌లో సిక్స్‌తో గేర్‌ మార్చిన రిజ్వీ.. 10వ ఓవర్‌లో షాబాజ్‌ బౌలింగ్‌లో మూడు ఫోర్లతో 16 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 14వ ఓవర్‌లో 6,4తో సమీర్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. జట్టు స్కోరు కూడా సెంచరీ దాటింది. మరోవైపు స్టబ్స్‌ కూడా బౌండ్రీ బాదాడు. దీంతో లక్ష్యం చివరి 5 ఓవర్లలో 29 పరుగులకు దిగొచ్చింది. రిజ్వీ 6,4 బాదగా.. స్టబ్స్‌ మరో భారీ షాట్‌ ఆడాడు. విజయానికి 18 బంతుల్లో 4 పరుగులు కావాల్సి ఉండగా.. సమీర్‌ భారీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.


ఓపెనర్‌గా పంత్‌: ఢిల్లీ బౌలర్లు సమష్టిగా రాణించడంతో.. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకొన్న లఖ్‌నవూ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌ జెయింట్స్‌.. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (7)ను ఓపెనర్‌గా పంపి ప్రయోగం చేసింది. కానీ, దురదృష్టవశాత్తూ పంత్‌ రనౌటవడంతో.. లఖ్‌నవూ తడబడింది. మరో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ క్రీజులో నిలదొక్కుకొన్నా.. పవర్‌ప్లేలో ఆశించిన రీతిలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించలేక పోయాడు. ధాటిగా ఆడే మార్‌క్రమ్‌ (11)ను అక్షర్‌ బౌల్డ్‌ చేయడంతో.. ఆరు ఓవర్లకు లఖ్‌నవూ 48/2తో నిలిచింది. ఆ తర్వాతి ఓవర్‌లో ఆయుష్‌ బదోని (0)ని నటరాజ్‌ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆదుకొంటాడనుకొన్న నికోలస్‌ పూరన్‌ (8) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఇక, 10వ ఓవర్‌లో కుల్దీప్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన మార్ష్‌.. మరో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ అవుటయ్యాడు. దీంతో సగం ఓవర్లు ముగిసే సరికి లఖ్‌నవూ 80/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో అబ్దుల్‌ సమద్‌, ముకుల్‌ (14) ఆరో వికెట్‌కు 34 పరుగుల భాగస్వామ్యంతో.. జట్టు స్కోరును సెంచరీ మార్క్‌ దాటించారు. అయితే, 14వ ఓవర్లో ముకుల్‌ను కుల్దీప్‌ రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. డెత్‌ ఓవర్లలో షాబాజ్‌ అహ్మద్‌ (15 నాటౌట్‌)తో కలసి సమద్‌.. ఏడో వికెట్‌కు 33 పరుగులు జోడించాడు. సమద్‌, షమి (1)ని నటరాజన్‌ అవుట్‌ చేయగా.. నోకియా (0), మొహిసిన్‌ ఖాన్‌ (0)ను ఎన్‌గిడి అవుట్‌ చేశాడు.


స్కోరుబోర్డు

లఖ్‌నవూ: మిచెల్‌ మార్ష్‌ (సి) స్టబ్స్‌ (బి) కుల్దీప్‌ 35, పంత్‌ (రనౌట్‌) 7, మార్‌క్రమ్‌ (బి) అక్షర్‌ 11, బదోని (సి) రాహుల్‌ (బి) నటరాజన్‌ 0, నికోలస్‌ పూరన్‌ (బి) ఎన్‌గిడి 8, అబ్దుల్‌ సమద్‌ (సి) మిల్లర్‌ (బి) నటరాజన్‌ 36, ముకుల్‌ (సి అండ్‌ బి) కుల్దీప్‌ 14, షాబాజ్‌ (నాటౌట్‌) 15, షమి (సి) కుల్దీప్‌ (బి) నటరాజన్‌ 1, నోకియా (సి) స్టబ్స్‌ (బి) ఎన్‌గిడి 0, మొహిసిన్‌ (సి) ముకేశ్‌ (బి) ఎన్‌గిడి 0, ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 18.4 ఓవర్లలో 141 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-19, 2-48, 3-49, 4-65, 5-71, 6-105, 7-138, 8-140, 9-141, 10-141; బౌలింగ్‌: ముకేశ్‌ 3-0-17-0, ఎన్‌గిడి 3.4-0-27-3, అక్షర్‌ 3-0-17-1, నటరాజన్‌ 4-0-29-3, కుల్దీప్‌ 4-0-31-2, విప్రజ్‌ 1-0-8-0.

ఢిల్లీ: రాహుల్‌ (సి) మొహిసిన్‌ (బి) షమి 0, నిస్సాంక (సి) పంత్‌ (బి) ప్రిన్స్‌ 1, నితీశ్‌ (సి) సమద్‌ (బి) మొహిసిన్‌ 15, సమీర్‌ రిజ్వి (నాటౌట్‌) 70, అక్షర్‌ (బి) ప్రిన్స్‌ 0, స్టబ్స్‌ (నాటౌట్‌) 39, ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 17.1 ఓవర్లలో 145/4; వికెట్ల పతనం: 1-0, 2-21, 3-25, 4-26; బౌలింగ్‌: షమి 4-0-28-1, ప్రిన్స్‌ 3-0-20-2, మొహిసిన్‌ 4-1-19-1, నోకియా 4-0-39-0, షాబాజ్‌ 1-0-16-0, మార్‌క్రమ్‌ 1-0-13-0, అబ్దుల్‌ 0.1-0-6-0.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 03:18 AM