ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయం: రేణుకా చౌదరి
ABN , Publish Date - Apr 02 , 2026 | 01:41 PM
ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయమని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించారని, ఎంత మంది వేధించినా రైతులు నిరసనలు ఆపలేదని ఆమె అన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయమని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించారని, ఎంత మంది వేధించినా రైతులు నిరసనలు ఆపలేదని ఆమె అన్నారు. ఇది అమరావతి రైతుల విజయమని చెప్పుకొచ్చారు. గురువారం రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీ రాజధానిపై 12 ఏళ్లుగా అస్పష్టత ఉందన్నారు. అస్పష్టత వల్లే పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లాయని తెలిపారు. దుగరాజపట్నం, కడప స్టీల్ ప్లాంట్‌ను ముగిసిన అధ్యాయం చేశారంటూ మండిపడ్డారు.
రేణుకా చౌదరి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘బిల్లు పెట్టడం కాదు.. టైంకు రాజధాని పూర్తి చేసి చూపించాలి. జగన్ మూడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారు. రెండు రాష్ట్రాలతో కేంద్రం ఆటలు ఆడుతోంది. లక్షా 47 వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు జరగలేదు. తెలంగాణకు ఇచ్చిన హామీలు కూడా కేంద్రం నెరవేర్చలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్‌టీపీసీ కూడా కేంద్రం ఇవ్వలేదు. ఇప్పటివరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదో కేంద్రం చెప్పాలి. హామీలు అమలు చేయనందుకు రెండు రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలి’..
‘12 ఏళ్ల తర్వాత కూడా ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదు. ఐదు గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందకుండా పోయాయి. భౌగోళికంగా ఏపీలో ఉన్నా.. ఆ గ్రామాలు ఇంకా ఇబ్బంది పడుతున్నాయి. తెలంగాణలో ఉండాలని కోరకుంటున్న వాళ్లను ఆంధ్రాలో కలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ముందుకు సాగక తప్పదు’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి
సూపర్ ఐడియా బాస్.. ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్యకు ఎలా చెక్ పెట్టాడో చూడండి..
కేవలం 2 పదార్థాలతో అద్భుతమైన ఫేస్ మాస్క్