కివీస్ మహిళల కొత్త చరిత్ర
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:14 AM
న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టింది. వన్డేల్లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో...
347 పరుగుల ఛేదనలో విజయం
భారత్ ప్రపంచ రికార్డు బద్దలు
అమేలియా కెర్ అద్భుత ఇన్నింగ్స్
రెండో వన్డేలో సఫారీల పరాజయం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టింది. వన్డేల్లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత సాధించింది. సఫారీలు నిర్దేశించిన 347 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మహిళల వన్డేల్లో నయా ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఈ క్రమంలో గతేడాది వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళల జట్టు ఛేదించిన 339 పరుగుల అత్యధిక ఛేదన రికార్డును కివీస్ తిరగరాసింది. ఆ మ్యాచ్ ఛేదనలో భారత్ 341/5 స్కోరు చేసిన సంగతి తెలిసిందే.
అమేలియా అదరహో..
తొలుత సఫారీ మహిళలు 50 ఓవర్లలో 6 వికెట్లకు 346 పరుగుల భారీ స్కోరు చేశారు. అన్నెకే బోష్ (91) తొమ్మిది పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకోగా.. కెప్టెన్ లారా వోల్వార్ట్ (69), ట్రయాన్ (52 నాటౌట్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సునె లూస్ (40), సినాలో జాఫ్తా (37) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో బ్రీ లింగ్ మూడు, కేలీ నైట్ రెండు వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో సారథి అమేలియా కెర్ (139 బంతుల్లో 23 ఫోర్లు, 1 సిక్సర్‌తో 179 నాటౌట్) సూపర్ సెంచరీతో సత్తా చాటడంతో కివీస్ 49.4 ఓవర్లలో 350/8 స్కోరు చేసి 2 వికెట్ల తేడాతో గెలిచింది. సఫారీ బౌలర్లలో కాకా 3, క్లాస్, రెనెకె చెరో 2 వికెట్లు తీశారు. భారీ ఛేదనలో కివీస్ కెప్టెన్ కెర్ అద్భుతంగా పోరాడింది. ఓపెనర్లు సుజీ బేట్స్ (8), ప్లిమ్మర్ (23)కు తోడు టాపార్డర్ బ్యాటర్ మ్యాడీ గ్రీన్ (13)లాంటి స్టార్లంతా విఫలమైన చోట కెర్ సంచలన ఇన్నింగ్స్‌తో విజృంభించింది. ఓవైపు వికెట్లు పడుతున్నా, ఏమాత్రం పట్టు విడవకుండా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇసబెల్లా గేజ్ (68) మాత్రమే కెర్‌కు అండగా నిలిచింది. 90 బంతుల్లోనే 100 పరుగులకు చేరిన అమేలియా.. కెరీర్‌లో ఐదో వన్డే సెంచరీని పూర్తి చేసుకుంది. ఇక, ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమైన వేళ.. కెర్ వరుసగా 4, 4, 2, 4 బాది కివీ్‌సకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టింది. అమేలియాకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. తొలి వన్డేలో ఓడిన కివీస్.. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆఖరి వన్డే శనివారం జరగనుంది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 346/6 (బోష్ 91, వోల్వార్ట్ 69, ట్రయాన్ 52 నాటౌట్, లూస్ 40; బ్రీ లింగ్ 3/60, నైట్ 2/65).
న్యూజిలాండ్: 49.4 ఓవర్లలో 350/8 (అమేలియా కెర్ 179 నాటౌట్, ఇసబెల్లా గేజ్ 68, ప్లిమ్మర్ 23; కాకా 3/51, రెనెక 2/54, క్లాస్ 2/61).
మహిళల వన్డేల్లో టాప్-5 ఛేదనలు
ఛేదించిన జట్టు ప్రత్యర్థి స్కోరు వేదిక (తేదీ)
న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా 350/8 వెల్లింగ్టన్ (2026 ఏప్రిల్ 1)
భారత్ ఆస్ట్రేలియా 341/5 ముంబై (2025 అక్టోబరు 30)
ఆస్ట్రేలియా భారత్ 331/7 వైజాగ్ (2025 అక్టోబరు 12)
శ్రీలంక దక్షిణాఫ్రికా 305/4 పోచెస్ట్రూమ్ (2024 ఏప్రిల్ 17)
ఆస్ట్రేలియా న్యూజిలాండ్ 289/6 సిడ్నీ (2012 డిసెంబరు 14)
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News