ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే న్యూస్..
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:50 PM
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై జట్టుకు ఓ శుభవార్త అందింది. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆ జట్టుతో చేరాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026లో భాగంగా ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సత్తా చాటింది. తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు ముంబై సిద్ధమైంది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై జట్టుకు ఓ శుభవార్త అందింది. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆ జట్టుతో చేరాడు. రేపటి మ్యాచ్‌కు ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండనున్నాడు. మిచెల్ శాంట్నర్ 2019లో ఐపీఎల్‌లో అడుగుపెట్టి.. ఐదు సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగాడు. 2025 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలించుకోగా.. ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది.
మరోవైపు ముంబై తుది జట్టులో శాంట్నర్(Mitchell Santner)కు ప్రస్తుత పరిస్థితుల్లో చోటు దక్కడం కష్టమే అయినా.. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మంచి బ్యాకప్ ఆప్షన్‌గా పనిచేస్తాడని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడంలో ఇతడు ప్రత్యేకం. స్పిన్ కీలకంగా మారే అవకాశం ఉన్న ఢిల్లీ వంటి నెమ్మదైన పిచ్‌పై అతని ఉనికి చాలా కీలకం కావచ్చు.
శాంట్నర్ గత సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి10 వికెట్లు పడగొట్టాడు. అలానే ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 31 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు కూల్చాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌కు చెందిన దాదాపు అందరు ప్లేయర్లు జట్టుతో చేరారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్‌జాక్స్ మాత్రం ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న దానిపై స్పష్టత లేదు.
ఇవి కూడా చదవండి:
చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?
అభిషేక్ శర్మపై బీసీసీఐ సీరియస్.. మ్యాచ్ ఫీజులో కోత