రెండు ట్రోఫీలు అందించినా గుర్తింపు లేదు.. క్లార్క్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:48 AM
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ రెండు ఐపీఎల్ టైటిళ్లు అందించినా తగిన గుర్తింపు దక్కలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నాడు. విరాట్ కోహ్లీ జట్టులో ఉండటంతో రజత్ గురించి ఎవరూ మాట్లాడటం లేదని అభిప్రాయపడ్డాడు.
స్పోర్ట్స్ డెస్క్: ప్రస్తుతం రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మార్మోగుతోంది. అందుకు కారణం.. వరుసగా రెండు సార్లు ఐపీఎల్ టైటిళ్లను గెలవడం. 17 ఏళ్ల పాటు ఐపీఎల్ ట్రోఫీని అందుకునేందుకు ఆర్సీబీ ఎంతో కష్టపడింది. ఐపీఎల్ ప్రారంభమైన ప్రతిసారి.. కప్ ఆర్సీబీదే అంటూ వారి అభిమానులు స్లోగన్స్ ఇవ్వడం..చివరకు నిరాశ ఎదురుకావడం జరిగేది. అయితే వారి కలలను నిజం చేస్తూ.. గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా అవతరించింది. ఇదే సంతోషం అనుకుంటే.. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఈ ఏడాది కూడా ట్రోఫీని గెలిచి.. అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. ఇదే సమయంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ రెండు ఐపీఎల్ టైటిళ్లు అందించినా తగిన గుర్తింపు దక్కలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ జట్టులో ఉండటంతో రజత్ పాటిదార్ గురించి ఎవరూ మాట్లాడటం లేదని తెలిపాడు. మైఖేల్ క్లార్క్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రజత్ పాటిదార్ మరోసారి సత్తా చాటాడు. అతను స్టార్ క్రికెటర్ కాకపోవడం.. కోహ్లీ జట్టులో ఉండటంతో పాటిదార్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ కెప్టెన్‌గా అతడు ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాడు. అతను వ్యక్తిగతంగా కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. భారత టీ20 జట్టులో చోటు దక్కేలా అతని గురించి చర్చ జరగాలి' అని మైఖేల్ క్లార్క్ పేర్కొన్నాడు.
'రజత్ పాటిదార్ టీమిండియాకు కెప్టెన్ అవుతాడో లేదో నాకు తెలీదు. కానీ, అతడిలో సారథ్యలో లక్షణాలున్నాయి. మిడిలార్డర్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. టీ20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. ఈ ఐపీఎల్‌లో రాణించిన చాలా మంది ఆటగాళ్లు టీమిండియాలో స్థానం కోసం పోటీ పడుతున్నారు. కానీ రజత్ పాటిదార్‌ను సెలెక్టర్లు తప్పకుండా దృష్టిలో ఉంచుకుంటారని నేను అనుకుంటున్నాను. టీ20ల్లో పాటీదార్ పేరు ముందుండాలి' అని క్లార్క్ సూచించాడు.
ఇవి కూడా చదవండి:
టెస్ట్ క్రికెట్ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ
సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్!