Share News

శ్రీలంక చేతిలో వెస్టిండీస్ ఘోర ఓటమి

ABN , Publish Date - Jun 04 , 2026 | 09:54 AM

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో శ్రీలంక జట్టు శుభారంభం చేసింది. కింగ్‌స్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై 41 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది.

శ్రీలంక చేతిలో వెస్టిండీస్ ఘోర ఓటమి
Sri Lanka vs West Indies

స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్ పర్యటనను శ్రీలంక జట్టు విజయంతో ప్రారంభించింది. నిన్న(జూన్ 4) కింగ్‌స్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కరేబియన్ జట్టుపై 41 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. దీంతో లంక జట్టు మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. శ్రీలంక విజయంలో కుశాల్ మెండిస్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన శ్రీలంక‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.


లంకేయులు నిర్ణీత 50 ఓవ‌ర్లలో 7 వికెట్లు కోల్పోయి 303 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓపెనర్ పాతుమ్‌ నిశాంక(103 బంతుల్లో 79 పరుగులు), కుశాల్ మెండిస్ (62 బంతుల్లో 72 పరుగులు) హాఫ్ సెంచ‌రీలతో స‌త్తాచాటారు. చరిత్‌ అసలంక(45), జనిత్‌ లియాంగే(44) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కరేబియన్ బౌలర్లలో జైడన్‌ సీల్స్‌, మాథ్యూ ఫోర్డ్‌, రోస్టన్ ఛేజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.


అనంతరం 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 49.2 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షైహోప్ (56) , గ్రీవ్స్‌(45) రాణించగా, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. లంక పేసర్ దుష్మంత చమీరా 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. తీక్షణ రెండు, హసరంగ, చరిత్ అసలంక తలో వికెట్‌ సాధించారు. కుశాల్‌ మెండిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. రెండో వన్డే ఇదే వేదికలో జూన్ 7న జరగనుంది.


ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 04 , 2026 | 10:45 AM